జోసెఫ్ రావణ్ (Joseph Ravan అరెస్ట్ మరియు ఆయనపై ఉగ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ) (UAPA) ప్రయోగించడంపై మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) తీవ్ర చర్చకు దారితీశాయి. రావణ్ కేసులో జనసేన పార్టీ (Jana Sena Party) వ్యవహరిస్తున్న తీరును ఆయన పరోక్షంగా తప్పుబట్టినట్లుగా, అదే సమయంలో ఈ వ్యవహారానికి తెలుగుదేశం పార్టీకి ప్రత్యక్ష సంబంధం లేదన్న భావన కలిగించేలా మాట్లాడారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
యూట్యూబర్ ప్రశ్నా ఛానల్‌కు చెందిన రావణ్ అరెస్ట్ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి (Nara Chandrababu Naidu) రాజకీయంగా నష్టం కలిగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో, ఈ అంశంలో జనసేన పార్టీని(Jana Sena Party) మాత్రమే పరోక్షంగా కార్నర్ చేసేలా వ్యాఖ్యానించారా అనే చర్చ మొదలైంది. రావణ్‌పై యూఏపీఏ చట్టం(UAPA Law) ప్రయోగించడం అతిపెద్ద తప్పని, భావప్రకటన స్వేచ్ఛను అణచివేసే చర్యగా దీనిని ఆయన అభివర్ణించారు.
సోషల్ మీడియాలో రావణ్‌పై జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఏబీవీ తీవ్రంగా విమర్శించారు. కొన్ని రాజకీయ పార్టీలు ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఎజెండా ప్రకారం వీడియోలను ఎడిట్ చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు జనసేనను ఉద్దేశించినవేనన్న చర్చ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
రావణ్ నక్సలైట్లకు (Naxalites) మద్దతు ఇచ్చారనే ఆరోపణలపై స్పందిస్తూ, నక్సలైట్ల గురించి మాట్లాడినంత మాత్రాన యూఏపీఏ కేసులు నమోదు చేయడం సరైంది కాదని ఏబీవీ అభిప్రాయపడ్డారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి (Marri Chenna Reddy) నక్సలైట్లపై నిషేధం ఎత్తివేసిన విషయాన్ని, అలాగే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (N.T. Rama Rao) ఎన్నికల ప్రచారంలో నక్సలైట్ల దేశభక్తులు అంటూ చేసిన వ్యాఖ్యలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అలాంటి వ్యాఖ్యలతో దేశద్రోహం లేదా ఉగ్రవాద చట్టాలు వర్తించవని అన్నారు.
హిందూ దేవతలను అవమానించారనే ఆరోపణలపై కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వైరల్ అవుతున్న వీడియోలు కట్ అండ్ పేస్ట్ చేసినట్లుగా కనిపిస్తున్నాయని, పూర్తి వీడియోలు చూస్తే సందర్భం వేరుగా అర్థమవుతుందని పేర్కొన్నారు. హిందూ మతంలోని దురాచారాలను ప్రశ్నించడం సామాజిక సంస్కరణలో భాగమని వివరిస్తూ, వివేకానందుడు(Kandukuri Veeresalingam), కందుకూరి వీరేశలింగం(Kandukuri Veeresalingam), రామకృష్ణ పరమహంస (Ramakrishna Paramahamsa) వంటి మహనీయులు కూడా మతంలోని లోపాలను చర్చించారని గుర్తు చేశారు. అలాగే రామాయణం విషవృక్షం అని రాసిన రంగనాయకమ్మ రచనలు లేదా దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు అని ప్రశ్నించిన తాపీ ధర్మారావు (Tapi Dharma Rao) వంటి వారి విమర్శలపై కూడా ఇలాంటి చట్టాలు ప్రయోగించరని అన్నారు.
అయితే రావణ్ మాట్లాడిన భాషలో అభ్యంతరకర అంశాలు ఉంటే వాటిపై సాధారణ చట్టాల కింద చర్యలు తీసుకోవచ్చని, కానీ ఉగ్రవాద నిరోధక చట్టాలను ప్రయోగించడం సమంజసం కాదని ఏబీవీ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆశక్తికర చర్చ సాగుతోంది. ఈ వివాదంలో బాధ్యత మొత్తం జనసేన పార్టీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైపే మళ్లేలా, తెలుగుదేశం పార్టీపై(TDP) విమర్శలు తగ్గించే ప్రయత్నమే ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యల వెనుక ఉద్దేశమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనసేన శ్రేణులు ప్రదర్శిస్తున్న అతిగా స్పందించే ధోరణి వల్ల కొన్ని వర్గాల ఓటర్లు కూటమికి దూరమయ్యే అవకాశం ఉందనే ఆందోళనతో ఆయన డ్యామేజ్ కంట్రోల్‌లో భాగంగా స్పందించి ఉండవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో, ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ పాత్ర లేదని, జనసేన ఒత్తిడి వల్లే కూటమికి రాజకీయ నష్టం జరుగుతోందనే కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందా అనే సందేహాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.






