మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు (A.B. Venkateswara Rao) రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఆయనకు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం(Bulletproof Vehicle), ఎస్కార్ట్ వాహనం(Escort Vehicle), గన్మెన్లను (Gunmen) తొలగించినట్లు సమాచారం.
సాధారణంగా నక్సల్స్ (Naxals) వ్యతిరేక ఆపరేషన్లలో పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా భద్రతను కొనసాగించడం ఆనవాయితీ. ప్రస్తుతం కూడా పలువురు మాజీ డీజీపీలు, ఉన్నతాధికారులకు అదే భద్రత కొనసాగుతుండగా, ఏబీ వెంకటేశ్వరరావుకు మాత్రమే ఉపసంహరించడం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది.
ఇటీవల 22ఏ భూములు (22A Lands), అమరావతి భూసేకరణ (Amaravati Land Acquisition), టెండర్లు(Tenders), ప్రభుత్వ విధానాలు వంటి అంశాలపై ఏబీ వెంకటేశ్వరరావు బహిరంగంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రత తొలగింపు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరిగిందా అనే చర్చ సాగుతోంది.
అయితే ఈ అంశంపై స్పందించిన ఏబీ వెంకటేశ్వరరావు భద్రతా వ్యవహారాలు అత్యంత సున్నితమైనవని, వాటిపై బహిరంగంగా మాట్లాడబోనని స్పష్టం చేశారు. తనకు చెప్పాల్సిన విషయాలను ఇప్పటికే ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేశానని, అవసరమైతే లేఖ ద్వారా మాత్రమే ప్రభుత్వంతో సంప్రదిస్తానని తెలిపారు.
గతంలో “నేను ఒకవేళ చనిపోతే అది సహజ మరణం కానే కాదు” అని చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భద్రత ఉపసంహరణ వెనుక నిజంగా భద్రతా సమీక్షే కారణమా? లేక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.







