అగ్నికుల క్షత్రియుల జాతిపితామహుడిగా గౌరవించబడే పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ (Ponnamanda Lakshmana Swamy Varma) జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) చేసిన వ్యాఖ్యలు ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తికి, నిరసనకు దారితీశాయి. కాకినాడ జిల్లా(Kakinada District) కోరంగిలో(Korangi) నిర్వహించిన జయంతి కార్యక్రమానికి నాగబాబు హాజరైయ్యారు.. అక్కడికి వచ్చిన వక్తలు అగ్నికుల క్షత్రియుల సామాజిక వర్గం అభ్యున్నతికి లక్ష్మణ స్వామి వర్మ చేసిన సేవలను కొనియాడారు. విద్యా వికాసం, సామాజిక ఐక్యతతో పాటు పేదల అభ్యున్నతికి, ఆయుర్వేద వైద్య రంగానికి (Ayurvedic Medical Field) ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
అయితే, ఇదే కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియులను సూచించే సందర్భంలో ‘మత్స్యకారులు’(Fishermen) అనే పదాన్ని నాగబాబు ఉపయోగించడంతో వివాదం మొదలైంది. ఈ పదాన్ని తమ సామాజిక వర్గానికి ఆపాదించడాన్ని తాము ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నామని అక్కడి కుల పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లక్ష్మణ స్వామి వర్మ జయంతి వేడుకలకు హాజరై, ఆయన చారిత్రక పోరాటానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం ఏమిటంటూ నాగబాబును నిలదీశారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చినట్లు సమాచారం.
పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ ఆధ్వర్యంలో ఏర్పడిన అగ్నికుల క్షత్రియ మహాసంఘం.. అప్పటి మద్రాస్ ప్రభుత్వ (Madras Government) అధికారిక రికార్డుల్లో తమ సామాజిక వర్గానికి సరైన కులనామం నమోదు చేయించేందుకు దీర్ఘకాలం ఉద్యమం చేసిందని ఆ వర్గానికి చెందిన పెద్దలు చెబుతున్నారు. ‘పల్లి’, ‘పల్లవ’, ‘మరకాలు’, ‘వన్నియర్’ వంటి పదాలకు సమానార్థకంగా ‘అగ్నికుల క్షత్రియ’(Agni Kula Kshatriya) అనే గుర్తింపును పేర్కొనాలని, ‘ఫిషర్ మ్యాన్’(Fisherman) అనే ఆంగ్ల పదం తమ అధికారిక కులనామాన్ని ప్రతిబింబించదని వారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని వివరిస్తున్నారు.
ఈ ఉద్యమం ఫలితంగా మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో చర్చ జరిగి, అనంతరం 1929 జూన్ 13న జీవో 271 జారీ అయిందని వారు పేర్కొంటున్నారు. అందువల్ల లక్ష్మణ స్వామి వర్మ జయంతి వంటి అధికారిక కార్యక్రమాల్లో ఆయన చారిత్రక ఆశయాలు, సామాజిక గుర్తింపు పోరాటాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాల్సిన అవసరం ఉందని అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం ప్రతినిధులు అంటున్నారు.
తమ చారిత్రక గుర్తింపుపై ఇంత సున్నితమైన అంశాన్ని పట్టించుకోకుండా ‘మత్స్యకారులు’ అనే పదాన్ని ఉపయోగించడం జనసేన నాయకత్వం పట్ల అసంతృప్తికి కారణమైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ సామాజిక వర్గ చరిత్ర, లక్ష్మణ స్వామి వర్మ చేసిన పోరాటం గురించి అవగాహన లేకుండా నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా? అని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో నాగబాబు వ్యాఖ్యలపై వివాదం రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.







