తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) మరో సినీ అభిమానుల రాజకీయ వేదిక తెరపైకి వచ్చింది. ప్రముఖ నటుడు అజిత్ కుమార్(Ajith Kumar) అభిమానులు(Fans) కాంచీపురం జిల్లా కుంద్రత్తూరులో ‘అనైతు నన్బర్గళ్ మున్నేట్రక్ కళగం’(Anaithu Nanbargal Munnetra Kazhagam) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీకి అజిత్ కుమార్ మద్దతు ఇచ్చినట్లు లేదా ఆయన ఇందులో చేరినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
2031లో అజిత్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా(CM) చూడటమే తమ లక్ష్యమని పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. పార్టీ తొలి సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 100 మంది అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అజిత్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టి. బాబు(T.Babu) ‘కారు’ను(Car) పార్టీ గుర్తుగా ప్రకటించారు.
మాదకద్రవ్యాల సమస్య పరిష్కారం, నీట్ రద్దు, పట్టభద్రులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాలను పార్టీ ప్రధానంగా ప్రస్తావించింది. రైతులకు షరతులు లేకుండా బ్యాంకు రుణాలు అందించడంతో పాటు రైతు కుటుంబాలకు నెలకు రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది.
అజిత్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానుల్లో కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పార్టీ ఏర్పాటు తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 20న కళ్లకురిచి జిల్లా ఉళుందూర్‌పేట సమీపంలో ‘తమిళగ మక్కల్ కళగం’(Tamilaga Makkal Kazhagam) పేరుతో మరో అభిమానుల రాజకీయ పార్టీని ప్రారంభించినట్లు కూడా నివేదికలు వచ్చాయి. అయితే అజిత్ స్వయంగా రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.








