అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న భూసేకరణ ప్రక్రియపై మాజీ జనసేన నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా, పారదర్శకత లేకుండా భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.
అమరావతి ప్రాంతంలో ఎకరాకు వాస్తవ మార్కెట్ విలువ సుమారు ₹5.05 కోట్లు ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం ₹45.70 లక్షల రిజిస్ట్రేషన్ విలువనే ఆధారంగా తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. భూసేకరణ, పునరావాసం మరియు పునరుద్ధరణ హక్కుల చట్టం (LARR)–2013తో పాటు ఏపీ సవరణ చట్టం–2018 ప్రకారం రైతులకు 100 శాతం సోలేషియంతో కలిపి ఎకరాకు కనీసం ₹10.10 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం ₹1 కోటి పరిహారం ఇచ్చి భూములు తీసుకోవాలని చూడడం చట్టవిరుద్ధమని విమర్శించారు.
రిజిస్ట్రేషన్ విలువలను పెంచకుండా ఉంచడం ద్వారా బ్లాక్ మనీకి ప్రోత్సాహం లభిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నిర్వహించకుండా భూసేకరణ చేపట్టడం చట్టానికి విరుద్ధమని, అర్ధరాత్రి నోటిఫికేషన్లు జారీ చేయడం, సెలవు దినాల్లో రైతులపై ఒత్తిడి తీసుకురావడం, కోర్టు కేసులను చూపిస్తూ భయపెట్టడం వంటి చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
నదీ గర్భం, వరద ముప్పు ప్రాంతాలకు చెందిన సుమారు 13 వేల ఎకరాల భూమిని పూలింగ్‌లో చేర్చడం జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు వ్యతిరేకమని బొలిశెట్టి పేర్కొన్నారు. వాగులు, నదుల సహజ ప్రవాహాలను మార్చడం చట్టరీత్యా తప్పని, కొంతమంది పెద్దల భూములను వదిలి పేద రైతుల భూములను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని విమర్శించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఖరిపైనా బొలిశెట్టి ప్రశ్నలు లేవనెత్తారు. 2018లో భూ నిర్వాసితుల సదస్సులో రైతులకు అన్యాయం జరిగితే అండగా ఉంటానని పవన్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, అప్పట్లో తప్పు అన్న చర్యలు ఇప్పుడు కూడా తప్పేనని వ్యాఖ్యానించారు. కూటమిలో ఉన్నామనే కారణంతో రైతుల సమస్యలను విస్మరించరాదని అన్నారు.
త్వరలో విజయవాడలో “భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సు” నిర్వహిస్తామని, ఆ సమావేశానికి పవన్ కళ్యాణ్‌ను కూడా ఆహ్వానిస్తామని బొలిశెట్టి వెల్లడించారు. రైతుల హక్కుల విషయంలో ఆయన తన వైఖరిని ప్రజల ముందు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
భూసేకరణలో ప్రభుత్వం పారదర్శకత పాటించకపోతే, రైతులకు చట్టబద్ధమైన పరిహారం అందించకపోతే బాధితుల తరఫున న్యాయపోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బొలిశెట్టి సత్యనారాయణ హెచ్చరించారు.







