ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra Pradesh Capital) అమరావతి ప్రాజెక్ట్‌పై ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సంజయ్ హెడ్గే (Sanjay Hegde) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించిన అభిప్రాయాలు, ఇప్పటికే కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక చర్చలకు కొత్త దిశను చూపిస్తున్నాయి. “స్మార్ట్ సిటీస్ మిషన్”(Smart Cities Mission) పేరుతో దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రాజెక్టుల వెనుక ఉన్న అవినీతి అంశాలను బహిర్గతం చేస్తామని “ఏ-టీక్-కర్-కో-దికో” (A-Teek-Kar-Ko-Dikho) అనే ఏక్స్ వేదిక ప్రకటించిన నేపథ్యంలో అమరావతి అంశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
సంజయ్ హెడ్గే (Sanjay Hegde) తన వ్యాఖ్యల్లో అమరావతి(Amaravati) ప్రాజెక్ట్‌పై అనేక కీలక సందేహాలను వ్యక్తం చేశారు. తాను ప్రత్యక్షంగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాతే ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అమరావతి ప్రాంతం ఇంకా అభివృద్ధి దశలో ఉండగా, అక్కడ అధిక సంఖ్యలో నాయకులు లేకుండా, కేవలం కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే నివసిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ నగరం సుదూర భవిష్యత్తులో అభివృద్ధి చెందే అవకాశం ఉందనే అభిప్రాయం ఉన్నా, ప్రస్తుతం భారీగా ఖర్చు చేస్తున్న నిధులను ఆ ప్రాంతం మోయగలదా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.
ప్రత్యేకంగా, దాదాపు లక్ష ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని నగర నిర్మాణానికి వినియోగించడం పై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ భూమి చిత్తడి నేలగా ఉండటంతో పాటు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఇలాంటి భౌగోళిక పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం చేయడం సముచితమా అనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ కొందరు అహంకారంతో తీసుకున్న నిర్ణయం కాకూడదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక రాజకీయ పరంగా కూడా ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధినేత జగన్(Jagan) ఇప్పటికే ఇదే అంశంపై గతంలో అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. తాను రాజధాని 29 గ్రామాలకి వ్యతిరేకం కాదని కాని అమరావతి ప్రాంతం భౌగోళికంగా, ఆర్థికంగా రాజధానికి అనుకూలం కాదని, వరద ముంపు, చిత్తడి నేలలు, వ్యవసాయ భూముల వినియోగం వంటి అంశాలు భవిష్యత్తులో రాష్ట్రానికి భారీ భారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా విశాఖపట్నం లేదా మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
సంజయ్ హెడ్గే వంటి అనుభవజ్ఞుడైన న్యాయవాది కూడా ఇదే తరహా ఆందోళనలను వ్యక్తం చేయడం ప్రజల్లో ఆలోచనకు దారితీస్తోంది. పౌర హక్కుల పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషించిన ఆయన, వివిధ జాతీయ స్థాయి కేసుల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన నేపథ్యం ఆయన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యతను ఇస్తోంది.
మొత్తానికి, అమరావతి రాజధాని ప్రాజెక్ట్‌పై మళ్లీ ఒకసారి సమగ్ర చర్చ అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తోంది. అభివృద్ధి పేరుతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజలపై ఎంతటి ప్రభావం చూపుతాయన్న అంశంపై ప్రభుత్వం, నిపుణులు, ప్రజలు కలిసి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








