దేశంలోని ప్రధాన ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టుల (Government Construction Projects) వ్యయాలతో పోలిస్తే అమరావతి (Amaravati) శాశ్వత సచివాలయ భవనాల (Permanent Secretariat Buildings) గ్లాస్ క్లాడింగ్(Glass Cladding), క్రౌన్(Crown), అట్రియం(Atrium), కెనోపీ స్కైలైట్(Canopy Skylight), కాలమ్ క్లాడింగ్(Column Cladding), పీవీ ప్యానెల్స్(PV Panels) వంటి అలంకరణ పనులకు రూ.2,540 కోట్లు కేటాయించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాష్ట్ర ఖజానాలో లోటు ఉందని చెబుతున్న ప్రభుత్వం ఇంత భారీ మొత్తాన్ని కేవలం అద్దాలు, అలంకరణల కోసం ఖర్చు చేయడంపై రాజకీయ వర్గాలు, ప్రజా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణలో(Telangana) హైదరాబాద్ నూతన సచివాలయ (Hyderabad New Secretariat) నిర్మాణ వ్యయం సుమారు రూ.1,100 కోట్లకు చేరగా, కొద్ది రోజుల క్రిందట తమిళనాడు ప్రభుత్వం చెన్నై(Tamil Nadu Government Chennai) నూతన అసెంబ్లీ –సచివాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి (New Assembly–Secretariat Complex) రూ.1,200 కోట్ల అంచనా వ్యయం నిర్ణయించారు. న్యూఢిల్లీలో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం (New Parliament Building) సవరించిన నిర్మాణ వ్యయం కూడా సుమారు రూ.1,200 కోట్లకు చేరింది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు భారీ ఆఫీస్ కాంప్లెక్స్‌ల మొత్తం వ్యయం రూ.1,299.08 కోట్లుగా ఉండగా, నూతన ఏపీ భవన్‌కు రూ.124.50 కోట్లు కేటాయించారు.
ఈ నేపథ్యంలో అమరావతి ఇంటిగ్రేటెడ్ సచివాలయం(Amaravati Integrated Secretariat), హెచ్‌వోడీ టవర్ల గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, అట్రియం తదితర పనులకు మాత్రమే రూ.2,540 కోట్ల పరిపాలనా అనుమతి ఇవ్వడం ప్రశ్నలను రేకెత్తిస్తోంది. దీనికి అదనంగా అసెంబ్లీ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, పాలవాగుపై అప్రోచ్ బ్రిడ్జిల వంటి సివిల్ పనులకు మరో రూ.798 కోట్లు ఆమోదించినట్లు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (Aarogyasri) బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్(Fee Reimbursement), ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం వంటి కీలక రంగాలకు నిధుల కొరత ఉందని ప్రభుత్వం చెబుతున్న వేళ, భారీ మొత్తాలను రాజధాని భవనాల అలంకరణలకు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా అవసరాల కంటే అట్టహాసానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
మహానగరాల్లో సాధారణ ప్రభుత్వ భవనాల చదరపు అడుగు నిర్మాణ వ్యయం సుమారు రూ.4,000–రూ.5,000 పరిధిలో ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో, అమరావతి సచివాలయ టవర్ల నిర్మాణం, అలంకరణలతో కలిపి చదరపు అడుగుకు రూ.18,500 నుంచి రూ.20,439 వరకు చేరుతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో అమరావతి నిర్మాణాల్లో వ్యయ ప్రాధాన్యతలు, అంచనాలు, టెండర్లపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రజాధనంతో అద్దాల మేడలు నిర్మించడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా మారిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.





