---Advertisement---

Weather Forecast: అండమాన్‌ చేరువలో నైరుతి రుతుపవనాలు.. ఏపీలో 5 రోజుల పాటు వర్షాల హెచ్చరిక!

May 14, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రానున్న 5 రోజుల పాటు వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశముందని విశాఖ (Visakhapatnam) తుఫాన్ హెచ్చరికల కేంద్రం (Cyclone Warning Centre) వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదే సమయంలో నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాకకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాధ కుమార్ (Jagannadha Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్-నికోబార్ దీవుల(Andaman & Nicobar Islands) ప్రాంతానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండగా, అది వచ్చే 48 గంటల్లో ఈశాన్య దిశగా కదిలే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ తీవ్ర అల్పపీడనానికి (Low Pressure System) అనుబంధంగా సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదేవిధంగా ఈ అల్పపీడనం నుంచి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరోవైపు మధ్యప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేశారు.

ప్రత్యేకంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావంతో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత మాత్రం కొనసాగవచ్చని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కర్నూలులో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో వర్షాలు కురిసినా వేడి, ఆర్ద్రత ప్రభావంతో ఉక్కపోత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment