ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పారిశ్రామిక వాతావరణంపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం (Central Government) విడుదల చేసిన సులభతర వాణిజ్యం ర్యాంకింగ్‌లో (Ease of Doing Business Ranking) రాష్ట్రం ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. మూడేళ్ల క్రితం దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దిగజారడం పెట్టుబడుల ఆకర్షణలో తగ్గుదలపై సందేహాలకు తావిస్తోంది.
99 పైసలకు భూములు(Lands), పెట్టుబడుల్లో (Investments) దాదాపు 60 శాతం వరకు సబ్సిడీలు (Subsidies) ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో కొత్త పరిశ్రమలు రాకపోవడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత, నిర్ణయాల స్థిరత్వంపై కార్పొరేట్ వర్గాల్లో సందేహాలు ఉన్నాయని, అందువల్లే కొన్ని సంస్థలు పెట్టుబడులకు వెనుకంజ వేస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటిస్తున్న లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని విమర్శలు కూడా వస్తున్నాయి.
ఇదే సమయంలో ప్రభుత్వం భూములు కేటాయించిన తర్వాత కూడా పలు సంస్థలు తమ పెట్టుబడి ప్రతిపాదనలను ఉపసంహరించుకోవడం చర్చనీయాంశమైంది. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్(Hindustan Coca-Cola Beverages), అజాద్ ఇండియా మొబిలిటీ(Azad India Mobility), జ్యూపిటర్ రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్(Jupiter Renewable Private Limited), జిన్‌ఫ్రా ప్రెసిషన్స్ (Zinfra Precisions) వంటి సంస్థలతో పాటు హైదరాబాద్‌కు చెందిన ఐస్పేస్ టెక్నాలజీస్ కూడా విశాఖలో రూ.119.18 కోట్ల ఐటీ క్యాంపస్ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. ప్రభుత్వం భూములు కేటాయించిన అనంతరం కూడా రూ.6,215 కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు రాష్ట్రాన్ని వీడినట్లు పేర్కొంటూ, ఇది రాష్ట్ర పారిశ్రామిక వాతావరణంపై ప్రతికూల సంకేతాలను ఇస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.







