ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) పారిశ్రామిక రంగం (Industrial Sector) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందా? ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో(Ease of Doing Business) అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం, ఇప్పుడు పెట్టుబడిదారుల (Investors’) విశ్వాసాన్ని కోల్పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ (YSR Congress Party Government) హయాంలో వేగంగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక రంగం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో వెనుకబడుతోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పెట్టుబడులు తగ్గడమే కాకుండా, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిస్థితులకు కూటమి నేతల జోక్యం, కమీషన్ల (Commissions) కోసం ఒత్తిళ్లు, రాజకీయ వేధింపులే ప్రధాన కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. “కప్పం కడితేనే కంపెనీ నడవాలి” అనే పరిస్థితి ఏర్పడిందని, దీంతో రాష్ట్ర పారిశ్రామిక ప్రతిష్ట దెబ్బతింటోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని యునైటెడ్ బ్రూవరీస్ (United Breweries) సంస్థ ఉదంతం ఈ ఆరోపణలకు ఉదాహరణగా నిలుస్తోంది. ఎమ్మెల్యే వర్గీయులు ప్రతి లారీకి రూ.1,000 చొప్పున నెలకు సుమారు రూ.1.50 కోట్ల మామూళ్లు డిమాండ్ చేశారని, నిరాకరించడంతో కంపెనీపై దాడులు చేసి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ జోక్యంతో కేసు నమోదైనా, చివరికి స్థానిక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కంపెనీ యాజమాన్యం రాజీ పడాల్సి వచ్చిందని విమర్శకులు పేర్కొంటున్నారు.
కడప జిల్లా జమ్మలమడుగులోని అల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్ (UltraTech Cement Plant) కూడా రాజకీయ వేధింపులకు గురైందనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) ఆదినారాయణ రెడ్డి (Adinarayana Reddy) ముడిసరకు రవాణా కాంట్రాక్టులను తమకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరాను అడ్డుకోవడంతో ఉత్పత్తి నిలిచిపోయిందని చెబుతున్నారు. కర్నూలులో కూడా ముడిసరకు రవాణాపై లారీకి రూ.250 చొప్పున వసూళ్లకు సంబంధించి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి(BC Janardhan Reddy), జేసీ బ్రదర్స్ ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి.
కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani) వ్యవహారం కూడా రాష్ట్ర పారిశ్రామిక ప్రతిష్టకు దెబ్బతీసిందనే విమర్శలు ఉన్నాయి. కడపలో స్టీల్ ప్లాంట్ (Kadapa Steel Plant) నిర్మించేందుకు ముందుకొచ్చిన జిందాల్ గ్రూప్‌ను (Jindal Group) రాజకీయ కారణాలతో లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అనంతరం సీఐడీ దర్యాప్తులో జెత్వానీ ప్రొఫెషనల్ బ్లాక్‌మెయిలర్ అని, ఆమె తన తల్లితో కలిసి పారిశ్రామికవేత్తల నుంచి రూ.1.32 కోట్లు వసూలు చేసినట్లు సాంకేతిక ఆధారాలు లభించాయని వెల్లడైంది.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో (Krishnapatnam Port) సెక్యూరిటీ తనిఖీల విషయంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు, రామాయపట్నం పోర్టు నిర్మాణ (Ramayapatnam Port Construction) సంస్థపై రాజకీయ ఒత్తిళ్లు, అలాగే యూరప్‌కు చెందిన ప్రముఖ సిమెంట్ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పపై (Balaji Govindappa) బలవంతంగా తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుని నమోదైన కేసులు కూడా పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన కలిగించాయని విమర్శలు ఉన్నాయి.
అదానీ-సెకీ (Adani-SECI) ఒప్పందంపై కూడా రాజకీయ వివాదాలు చెలరేగాయి. అమెరికాలో అదానీపై 2,300 కోట్లుకు సంభందించి నమోదైన కేసును ఎటువంటి సంభందంలేని ఏపీ సెకీ ఒప్పందంతో అనుసంధానిస్తూ ప్రచారం జరిగినప్పటికీ, ఈ ఒప్పందం యూనిట్‌కు రూ.2.49తో రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తక్కువ ధరకు కుదిరిందని, దీని ద్వారా వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.1.10 లక్షల కోట్ల ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని తరువాత ప్రభుత్వమే ఓప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం అమెరికా న్యాయశాఖ అదానీపై నమోదైన కేసును ఉపసంహరించుకునే ప్రక్రియ ప్రారంభించడం కూడా చర్చనీయాంశమైంది.
గణాంకాలు కూడా పారిశ్రామిక రంగంలో ఆందోళనకర పరిస్థితులను సూచిస్తున్నాయి. గత రెండేళ్లలో రాష్ట్రంలో 4,520 ఎంఎస్‌ఎంఈలు మూతపడగా, 48,477 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే పార్లమెంట్‌లో వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో పోలిస్తే, వాస్తవ పెట్టుబడులు కేవలం రూ.6,962 కోట్లేనని కేంద్రం తెలిపింది. మరోవైపు సుమారు రూ.6,215 కోట్ల విలువైన కోకాకోలా, ఆజాద్ ఇండియా మొబిలిటీ వంటి పెట్టుబడులు రాష్ట్రాన్ని విడిచిపెట్టినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 8వ స్థానానికి పడిపోయిందని నీతి ఆయోగ్ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వ విధానాలు, రాజకీయ జోక్యాలు, పెట్టుబడిదారులపై ఒత్తిళ్లు కొనసాగితే రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుందనే ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. పెట్టుబడులు ఆకర్షించాల్సిన ప్రభుత్వం, పెట్టుబడిదారులను భయపెట్టే పరిస్థితి ఏర్పడితే దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.







