ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business) ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ఇప్పుడు పెట్టుబడుల అనుకూలత విషయంలో వెనుకబడుతోందా? ఈ ప్రశ్నకు బలం చేకూర్చేలా నీతి ఆయోగ్ (NITI Aayog) విడుదల చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ 2026 (Investment Friendly Index 2026) నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
జూలై 17, 2026న విడుదలైన ఈ నివేదిక ప్రకారం, దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 48.7 స్కోరుతో 8వ స్థానంలో, పెద్ద రాష్ట్రాల విభాగంలో 6వ స్థానంలో నిలిచింది. రాష్ట్రం ఫ్రంట్ రన్నర్ విభాగంలో ఉన్నప్పటికీ, టాప్-5లో చోటు సంపాదించలేకపోయింది. దేశవ్యాప్తంగా తొలి ఐదు స్థానాల్లో గుజరాత్ (Gujarat) (56.6), మహారాష్ట్ర (Maharashtra) (53.7), తమిళనాడు (Tamil Nadu) (53.3), గోవా (Goa) (53.1), ఒడిశా (Odisha) (52.4) నిలిచాయి.

నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ వెనుకబడటానికి ప్రధాన కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటమే. రాష్ట్ర మొత్తం అప్పులు జీఎస్డీపీలో (GSDP 35 శాతానికి చేరుకోగా, ఇది పెద్ద రాష్ట్రాల సగటు 30.3 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. అలాగే రాష్ట్ర ఆర్థిక లోటు (Fiscal Deficit) ఆర్థిక సంఘం (Finance Commission) నిర్దేశించిన పరిమితిని మించి ఉండటంతో అభివృద్ధి, పెట్టుబడులపై ప్రభావం పడుతున్నట్లు నివేదిక పేర్కొంది.
పారిశ్రామిక విధానాలు ఉన్నప్పటికీ, పరిశ్రమలకు ప్రకటించిన ప్రోత్సాహకాల విడుదలలో జాప్యం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని నివేదిక తెలిపింది. విద్యుత్(Electricity), నీరు(Water) వంటి అనుమతుల కోసం పలు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ప్రాజెక్టుల ప్రారంభంలో ఆలస్యం జరుగుతోందని కూడా పేర్కొంది.
అదేవిధంగా కార్మిక సమస్యలు (Labour Issues), నియంత్రణ వ్యవస్థపై పెట్టుబడిదారుల అభిప్రాయాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉండటం కూడా రాష్ట్ర స్కోరుపై ప్రభావం చూపిన అంశంగా గుర్తించింది. మౌలిక సదుపాయాల విషయంలో విశాఖపట్నం (Visakhapatnam) వంటి ప్రధాన నగరాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, టైర్-2, టైర్-3 నగరాల్లో రహదారి నాణ్యత, అలాగే విమానాశ్రయ కార్గో సదుపాయాల అభివృద్ధి అవసరమని నివేదిక సూచించింది.
అయితే, డిజిటల్ లావాదేవీలు(Digital Transactions), సహజ వనరుల లభ్యత వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంచి ప్రదర్శన కనబరిచిందని కూడా నీతి ఆయోగ్ పేర్కొంది. కానీ ఆర్థిక క్రమశిక్షణ లోపించడం, పెరుగుతున్న అప్పులు, పరిపాలనలో జాప్యాలు వంటి కారణాల వల్ల రాష్ట్రం అగ్రస్థానాలకు చేరుకోలేకపోయిందని నివేదిక స్పష్టం చేసింది.







