శ్రీకాకుళం జిల్లాలోని (Srikakulam District) ఉద్దానం ప్రాంతం (Uddanam Region) ఒకప్పుడు పచ్చని ప్రకృతితో ఉద్యానవనంలా వెలసినా, గత నాలుగు దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధి (Kidney Disease) మహమ్మారి అక్కడి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో వేలాది కుటుంబాలు ఈ వ్యాధితో తీవ్రంగా నష్టపోయాయి. ఒకే కుటుంబంలో పలువురు సభ్యులు కిడ్నీ వ్యాధితో మరణించిన ఘటనలు స్థానికుల బాధను అద్దంపడుతున్నాయి.
సురక్షితమైన తాగునీటి కొరత (Drinking Water), కలుషితమైన బోరు నీటి (Borewell Water) వినియోగమే ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణమని నిపుణుల నివేదికలు సూచించాయి. 2004 వైయస్సార్ (YSR) గారు అధికారంలో ఉన్నపటి నుండి ప్రభుత్వ చోరవతో హార్వర్డ్ మెడికల్ స్కూల్, సిసిఎంబి, నిమ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అనేక సంస్థలు పరిశోధనలు నిర్వహించినప్పటికీ ఖచ్చితమైన కారణం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది. 2013లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధికి “ఉద్దానం నెఫ్రోపతి” (Uddanam Nephropathy) అని పేరు పెట్టడం సమస్య తీవ్రతను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లింది.
స్థానికుల అభిప్రాయం ప్రకారం, గత ప్రభుత్వాలు ఈ సమస్యను రాజకీయ ప్రచారానికే పరిమితం చేశాయని. డయాలసిస్ (Dialysis) కోసం బాధితులు విశాఖపట్నం (Visakhapatnam) వరకు ప్రయాణించాల్సి రావడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా కుప్పకూలిపోయాయని. పరిమిత సంఖ్యలో మాత్రమే పెన్షన్లు అందడంతో బాధితుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని వాపోయారు.
అయితే వైఎస్ జగన్ (YS Jagan) అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దానం సమస్యపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. రూ. 700 కోట్ల వ్యయంతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్ (YSR Sujaladhara Project) ద్వారా 807 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రయత్నం చేపట్టారని. పలాసలో రూ. 85 కోట్లతో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ (YSR Kidney Research Center) ఏర్పాటు చేసి డయాలసిస్ సదుపాయాలు, అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని. డయాలసిస్ రోగుల పెన్షన్ను రూ. 2,500 నుంచి రూ. 10,000కు పెంచి వేలాది మందికి ఆర్థిక భరోసా కల్పించారని చెప్పుకోచ్చారు.
అయితే ప్రస్తుతం కూటమి పాలనలో (Coalition Government) ఉద్దానం పరిస్థితి మళ్లీ ఆందోళనకరంగా మారుతోందని బాధితులు చెబుతున్నారు. గతంలో నిరంతరంగా నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలు (Screening Tests) నిలిచిపోయాయని, గ్రామాల్లో మందుల సరఫరా తీవ్రంగా తగ్గిందని ఆరోపిస్తున్నారు. గత జగన్ పరిపాలనలో (Jagan Administration) 37 రకాల మందులు సరఫరా చేస్తే ప్రస్తుతం వాటిని రెండు మూడు రకాలకి కుదించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రియాటినిన్ స్థాయి అధికంగా ఉన్న కొత్త బాధితులకు పెన్షన్లు మంజూరు కావడం లేదని, పరీక్షల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడం తమపై అదనపు ఆర్ధిక భారం మోపుతోందని వాపోతున్నారు.
ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గతంలో ప్రారంభమైన చర్యలు కొనసాగాల్సిన అవసరం ఉందని, స్క్రీనింగ్, మందుల సరఫరా, పెన్షన్ మంజూరు వంటి అంశాల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా ప్రజలను వెంటాడుతున్న ఈ కిడ్నీ మహమ్మారికి ఇకనైనా పూర్తి స్థాయి పరిష్కారం లభిస్తుందా అనే ప్రశ్న మళ్లీ ఉద్దానం ప్రజల మనసుల్లో కలవరాన్ని రేపుతోంది.






