ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల లేమి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. అత్యవసర వైద్యం అవసరమైన సమయంలో కనీసం అంబులెన్స్ కూడా గ్రామాలకు చేరుకోలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, పురిటినొప్పులతో ఇబ్బందిపడుతున్న గర్భిణులను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డోలీల్లో మోసుకెళ్లాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని పాలకులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఘటనలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని గిరిజన గ్రామాల్లో రహదారి సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా దారాపర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని కురిడి గ్రామానికి చెందిన 40 ఏళ్ల మజ్జి సన్నమ్మ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు తక్షణ వైద్య చికిత్స అవసరం కావడంతో కుటుంబ సభ్యులు శనివారం ఆమెను డోలీలో మోసుకుంటూ సుమారు 7 కిలోమీటర్ల మేర ప్రయాణించారు.
కాలిబాటలు, ఎగుడుదిగుడు ప్రాంతాలను దాటుకుంటూ మెట్టపాలెం జంక్షన్ వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనంలో శృంగవరపుకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అత్యవసర సమయంలో గ్రామానికి వాహనం చేరుకునే అవకాశం లేకపోవడంతో బాధితురాలిని ఇలా మోసుకెళ్లాల్సి వచ్చిందని. గిరిజన ప్రాంతాల్లో కనీస రహదారి సదుపాయాలు కల్పించడంలో ఉన్న లోపాలకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఈ నెల మొదటి వారంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గూడెం కొత్తవీధి మండలం అమ్మవారి ధారకొండ పంచాయతీ పరిధిలోని తాడకపల్లి గ్రామానికి చెందిన కొర్ర దామిని అనే గర్భిణికి రాత్రి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే గ్రామానికి వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో కనీసం ద్విచక్ర వాహనం కూడా అక్కడికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది.
దీంతో ఆమె రాత్రంతా గ్రామంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి ఆమెను డోలీలో మోసుకుంటూ కొండలు, రాళ్లు, వాగులు దాటుకుంటూ సుమారు 8 కిలోమీటర్ల దూరంలోని శ్యామగెడ్డకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో చింతపల్లి కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్యకరమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటం ఊరటనిచ్చినా, అత్యవసర సమయంలో ఆసుపత్రికి చేరుకోవడానికి గర్భిణి ఇన్ని కష్టాలు పడాల్సి రావడం గిరిజన ప్రాంతాల్లో వైద్య, రవాణా సదుపాయాల పరిస్థితిని ప్రశ్నార్థకం చేస్తోంది.
అల్లూరి జిల్లాలో రహదారి సమస్యలతో పాటు వంతెనల కొరత కూడా గిరిజనులకు శాపంగా మారుతోంది. కొత్తవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని చిన్న గంగవరం గ్రామానికి చెందిన 28 ఏళ్ల గిరిజన మహిళ పాంగి లావణ్య ప్రసవం అనంతరం సకాలంలో వైద్యం అందక మృతి చెందిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. భారీ వర్షాలు, వరదల కారణంగా గంగవరం వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయని స్థానికులు వెల్లడించారు.
ఈ వంతెనకు శాశ్వత పరిష్కారం లేకపోవడంతో 15కు పైగా గిరిజన గ్రామాల ప్రజలు రాకపోకల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో వాగులు ఉప్పొంగడం, కొండ మార్గాలు ప్రమాదకరంగా మారడంతో అత్యవసర వైద్య సేవలు అందుకోవడం మరింత కష్టమవుతోందని స్థానికులు చెబుతున్నారు.
రాష్ట్రంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని, మౌలిక సదుపాయాల కల్పనలో ముందుకు వెళ్తున్నామని కూటమి పాలకులు ప్రకటిస్తున్నారు. అయితే మన్యం ప్రాంతాల్లో మాత్రం కనీస రహదారి సౌకర్యాలు లేక గిరిజనులు ప్రాణాలను పణంగా పెట్టి ఆసుపత్రులకు చేరుకోవాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేని పరిస్థితి ఉంటే, అభివృద్ధి ఫలాలు మారుమూల గిరిజన ప్రాంతాలకు ఎంతవరకు చేరుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మించామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో, కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని గ్రామాల పరిస్థితిపై సమాధానం చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
డోలీల్లో రోగులను మోసుకెళ్లే ఘటనలు ఒక్క గ్రామానికో, ఒక్క జిల్లాకో పరిమితం కావడం లేదు. రహదారులు, వంతెనలు, అత్యవసర రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారుతోంది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మారుమూల గ్రామాలకు అన్ని కాలాల్లోనూ రాకపోకలు సాగించేలా రహదారులు నిర్మించడం, వాగులపై శాశ్వత వంతెనలు ఏర్పాటు చేయడం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అత్యంత కీలకం. అభివృద్ధి అంటే ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు మాత్రమే కాదు.. అత్యవసర సమయంలో ప్రతి గిరిజనుడికి సకాలంలో వైద్యం అందేలా చూడటమే నిజమైన అభివృద్ధని పౌరసంగ నేతలు చెబుతున్న మాట .







