దర్శకుడు నితీష్ తివారీ (Nitesh Tiwari) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’(Ramayana) నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. నవరాత్రుల సందర్భంగా చిత్ర బృందం సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో పాటు, కొత్త పోస్టర్‌ను (New Poster) విడుదల చేసింది. ఈ ప్రకటనతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
నమిత్ మల్హోత్రా (Namit Malhotra) నిర్మిస్తున్న ‘రామాయణ – పార్ట్ 1’ నవంబర్ 5 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. అన్ని ప్రీమియం ఫార్మాట్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దసరా పండుగ (Dussehra Festival) రోజున అడ్వాన్స్ బుకింగ్‌లు (Advance Bookings) ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల శుభ సందర్భంలో శ్రీరాముని యుగారంభానికి నాంది పలుకుతున్నామని చిత్ర బృందం ప్రకటించింది.
తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో యశ్ (Yash) రావణుడిగా (Ravana) భీకరమైన రూపంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. రణబీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతాదేవిగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ పాత్రలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు కాజల్ అగర్వాల్ మండోదరిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా కనిపించనున్నారు.
‘రామాయణ’ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని నవంబర్ 5న విడుదల చేయనుండగా, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. కొత్త పోస్టర్‌లో నటీనటుల లుక్స్, విడుదల తేదీ ప్రకటనతో ఈ భారీ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.







