విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆలయ చైర్మన్, ఈవో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన పూజా మండపంలో కుంకుమార్చనలు, యాగశాలలో శాస్త్రోక్తంగా చండీ హోమం ప్రారంభ పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు ప్రకటించారు.
అయితే, దసరా ఉత్సవాల తొలిరోజే ఇంద్రకీలాద్రిపై భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. క్యూలైన్లలో కనీసం తాగునీరు కూడా అందించడం లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంపీ కేశినేని చిన్నిని నిలదీసి తమ సమస్యలను వివరించారు. మరోవైపు, దుర్గగుడి వద్ద మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. తమను అనుమతించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ, జిల్లా కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
భక్తులకు అందుతున్న సౌకర్యాలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలకు తెలియజేసే బాధ్యత మీడియాపై ఉందని, అలాంటి విధులను నిర్వర్తించకుండా ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం, తమ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకే మీడియాపై ఆంక్షలు విధిస్తోందని వారు ఆరోపించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మీడియాపై ఆంక్షలు విధించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తూ, వార్తలను ప్రజలకు చేరవేసే మీడియాను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఉత్సవాల నిర్వహణపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అంటూ విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్య వైఖరిని విడనాడి భక్తులకు తాగునీరు సహా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, మీడియా ప్రతినిధులకు స్వేచ్ఛగా విధులు నిర్వహించే అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.






