అన్నమయ్య జిల్లాలో (Annamayya District) ఎర్రచందనం (Red Sanders) అక్రమ రవాణా (Illegal Transportation) మరోసారి కలకలం రేపింది. వీరబల్లి మండలం కొట్టేగి వాండ్లపల్లి సమీపంలో 13 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సానిపాయి ఫారెస్ట్ రేంజ్ (Sanipayi Forest Range) పరిధిలో అక్రమ రవాణాపై సమాచారం అందడంతో నిర్వహించిన దాడుల్లో 409 కిలోల బరువున్న ఎర్రచందనం దుంగలతో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వ్యక్తిని గాలివీడు మండలం తూముకుంటకు చెందిన తోట వెంకటాద్రిగా(Thota Venkatadri) రేంజర్ వైసీ రెడ్డి (Ranger YC Reddy) వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.2,10,647 ఉంటుందని అధికారులు తెలిపారు.
అరెస్టైన తోట వెంకటాద్రి టీడీపీకి(TDP) చెందిన నాయకుడిగా, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandipalli Ramprasad Reddy) ప్రధాన అనుచరుడిగా సమాచారం. గతంలోనూ ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి మదనపల్లె, రేణిగుంట, రాయచోటి ప్రాంతాల్లో తనపై ఐదు కేసులు నమోదైనట్లు సమాచారం. ఇప్పటికే రెండు, మూడు పర్యాయాలు పోలీసులకు పట్టుబడి అరెస్టైనట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
రాయచోటి పట్టణంలో నివాసముంటున్న వెంకటాద్రి తాను న్యాయవాదినని చెప్పుకుంటూ తిరుగుతుంటారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పగటిపూట టీడీపీ(TDP) కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, ఇటీవల నిర్వహించిన ‘డోర్ టు డోర్’(Door-to-Door Campaign) ప్రచారంలోనూ పాల్గొన్నారని సమాచారం. తాజాగా ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాలో పట్టుబడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారని అధికారులు చెబుతుంటారు. అయితే, గతంలో పలుమార్లు పట్టుబడ్డ వ్యక్తిపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అధికార పార్టీతో సంబంధాలున్న వ్యక్తులకు చట్టం విషయంలో ప్రత్యేక వెసులుబాటు లభిస్తోందా? అన్న ఆరోపణలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.






