ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఒక అసాధారణమైన పరిణామం చోటుచేసుకుంటోంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారి విధానాలకు రక్షణ కవచంలా నిలిచిన వారు, ఆయనకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు అదే ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఇది కేవలం వ్యక్తిగత అసంతృప్తి కాదని, ఇది ఒక ‘వ్యవస్థాగత సంక్షోభానికి’ సంకేతమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంలో అధికారుల మధ్య అంతర్గతంగా ప్రబలుతున్న అసంతృప్తిని క్షుణ్ణంగా పరిశీలించిన ఈ మాజీ అధికారులు ఇప్పుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా గళమెత్తుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పాలకుల పనితీరుపై అనుభవజ్ఞులు ఇస్తున్న అంతర్గత ‘రిపోర్ట్ కార్డ్’గా దీనిని అభివర్ణిస్తున్నారు.
రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి నమూనాపై మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి.వి. రమేష్(Dr. P.V. Ramesh) లేవనెత్తిన అంశాలు పాలకుల ‘పాలనా ప్రాధాన్యతల వైఫల్యాన్ని’ ఎండగడుతున్నాయి. సుమారు 40 ఏళ్ల పరిపాలనా అనుభవం కలిగి, ఆర్థిక శాఖ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన ఆయన, అమరావతిని కేవలం ఒక “డెట్-ఫైనాన్స్డ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్”గా (Debt-Financed Real Estate Project) అభివర్ణించడం గమనార్హం. ప్రపంచ ప్రఖ్యాత మాన్హాటన్ నగరం కేవలం 15,400 ఎకరాల్లో అత్యున్నత వసతులతో విస్తరించి ఉంటే, అమరావతి కోసం 50,400 ఎకరాల భూమిని సేకరించడం వెనుక ఉన్న హేతుబద్ధతను ఆయన ప్రశ్నించారు. ఇది “ప్రజల నగరం”(People’s City) కంటే “రియల్ ఎస్టేట్ గేమ్”లా (Real Estate Game) ఉందన్నది ఆయన ప్రధాన విమర్శ.
రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో 17 నుంచి 20 మిలియన్ల ప్రజలకు ఇప్పటికీ సురక్షితమైన తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలు లేవని ఆయన పేర్కొన్నారు. అవేవీ పట్టించుకోకుండా కేవలం ఒక నగరంపైనే దృష్టి పెట్టడం పాలనాపరమైన అసమతుల్యతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక లోటు 75 శాతానికి పైగా ఉన్న తరుణంలో, భారీ అప్పులతో కూడిన ఈ రియల్ ఎస్టేట్ మోడల్ రాజధాని రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టడమేనని ఆయన హెచ్చరించారు. రాజధాని నగరం కేవలం ధనిక వర్గాల కోసం కాకుండా, పేదలు, మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండాలని పీవీ రమేష్ స్పష్టం చేశారు.
మరోవైపు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న మాజీ అధికారులపై పాలకులు తీసుకుంటున్న చర్యలు మరిన్ని వివాదాలకు దారితీస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు (A.B. Venkateswara Rao) భద్రతను తగ్గించడం ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. నక్సల్స్ హిట్‌లిస్టులో ఉన్న ఒక సీనియర్ అధికారికి పదవీ విరమణ తర్వాత కూడా భద్రత కల్పించడం ఒక ‘ఆనవాయితీ’గా ఉందని, అయితే ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఆయన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని, డ్రైవర్‌ను ఉపసంహరించుకుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘సిటిజన్స్ ఫర్ సివిల్ లిబర్టీస్’(Citizens for Civil Liberties) అనే సంస్థ ద్వారా ఏబీ వెంకటేశ్వరరావు లేవనెత్తిన 22ఏ భూములు, అమరావతి భూసేకరణ, టెండర్లలోని అక్రమాలపై గళమెత్తినందుకే ఈ చర్య తీసుకున్నారనే బలమైన చర్చ అధికార వర్గాల్లో వినిపిస్తోందని చెబుతున్నారు. వ్యవస్థలను కక్షసాధింపు కోసం వాడుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారుతుందని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో చేసిన “నేను ఒకవేళ చనిపోతే అది సహజ మరణం కానే కాదు” అనే వ్యాఖ్య ఇప్పుడు వ్యవస్థలోని భయాందోళనలకు అద్దం పడుతోందని పేర్కొంటున్నారు.
అలాగే చట్టబద్ధమైన పాలనలో ‘చిన్న తప్పులకు పెద్ద చట్టాలు’ ప్రయోగించే ధోరణిని ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా ఎండగట్టారు. యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’పై (Prashna Ravana) దేశద్రోహం, యూఏపీఏ వంటి కఠిన చట్టాలను ప్రయోగించడాన్ని ఆయన తప్పుబట్టారు. రావణ్ చేసిన వ్యాఖ్యల్లో బూతులు ఉన్నాయని అంగీకరిస్తూనే, వాటిని మాటలతో ఎదుర్కోవాలని హితవు పలికారు. “మాటలకు సమాధానం మాటలతోనే చెప్పాలి.. సంకెళ్లతో కాదు” అనే నినాదంతో ఆయన ప్రభుత్వ అత్యుత్సాహాన్ని ప్రశ్నించారు. పాలకుల తీరు హుందాగా ఉండాలని కోరుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్య కూడా తీవ్ర చర్చకు దారితీసింది: “రాష్ట్రాన్ని ఆధునిక ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలి.. ఆఫ్ఘనిస్థాన్‌లా (Afghanistan) మార్చే దిశగా కాదు అని ఆయన చెప్పుకోచ్చారు.” తెలంగాణలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ (Nagarjuna Yadav) అరెస్ట్ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ, భావప్రకటన స్వేచ్ఛను అణచివేయడం ఏ ప్రభుత్వానికైనా ముప్పు అని ఆయన హెచ్చరించారు.
అలాగే ప్రభుత్వ ఆర్థిక ప్రచారాలపై మాజీ సీబీఐ(CBI) డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు (Mannem Nageswara Rao) సంధించిన విమర్శలు కూడా చర్చనీయాంశంగా మారాయి. విద్యుత్ రంగ సంస్కరణల క్రెడిట్ విషయంలో చంద్రబాబు గారి వాదనలను ఆయన తిప్పికొట్టారు. సంస్కరణల ప్రక్రియ 1992లో ఒడిశాలో(Odisha) బిజూ పట్నాయక్(Biju Patnaik) హయాంలోనే ప్రారంభమైందని, 1995లో ‘ఒడిశా విద్యుత్ సంస్కరణల చట్టం’(Odisha Electricity Reform Act) అమల్లోకి వచ్చిందని, అంటే చంద్రబాబు (Nara Chandrababu Naidu) సీఎం కాకముందే ఈ ప్రక్రియ మొదలైందని ఆధారాలతో పేర్కొన్నారు. ఇతరుల కృషిని తమ ఖాతాలో వేసుకోవడం నైతిక పతనానికి సంకేతమని ఆయన విమర్శించారు.
అలాగే ముగ్గురు పిల్లల విధానంపై స్పందిస్తూ, అది సీఎం గారి కుటుంబంలోనే మొదలవ్వాలని, ముందుగా నారా లోకేశ్-బ్రాహ్మణి (Nara Lokesh-Brahmani) దంపతులు మరో ఇద్దరు పిల్లలను కనాలన్నది ఆయన వ్యంగ్యాస్త్రంగా పేర్కొన్నారు. ప్రజలకు పొదుపు పాఠాలు చెప్పే పాలకులు, తాము మాత్రం చార్టర్డ్ విమానాల్లో (Chartered Flights) తిరగడం ఏ రకమైన నీతి అని ఆయన ప్రశ్నించారు. చార్టర్డ్ విమానాల వినియోగాన్ని నిషేధిస్తూ జీవో ఇస్తేనే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు భావించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపధ్యంలో కేవలం రెండేళ్ల కాలంలోనే ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా మెలిగిన అధికారులు ఇంత ఘాటైన విమర్శకులుగా మారడం ప్రభుత్వ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది అధికారుల మనోగతానికి మాత్రమే పరిమితం కాకుండా, ఒక ప్రభుత్వానికి ‘డేంజర్ బెల్’గా (Danger Bell) చూడాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
విమర్శలను అణచివేయడం లేదా విమర్శించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం వల్ల సమస్యలు పరిష్కారం కావని, పైగా అవి వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని సడలిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా చంద్రబాబు గారి తనయుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న కొద్దీ పాలనలో అరాచకం పెరుగుతోందని, ఒకప్పుడు టీడీపీకి(TDP)అనుకూలంగా ఉన్న వారు సైతం భరించలేక దూరం జరుగుతున్నారని రాజకీయ విశ్లేషకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లలో ఈ స్థాయిలో ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదని ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి.






