---Advertisement---

జగన్ హయాంలో అభివృద్ధి.. కూటమి ఖాతాలో క్రెడిట్? వరుసగా వెల్లువెత్తుతున్న ‘క్రెడిట్ చోరీ’ ఆరోపణలు!

July 5, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ప్రస్తుత కూటమి ప్రభుత్వం (Coalition Government) పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు, ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకుంటూ “క్రెడిట్ చోరీ”కి (Credit Theft) పాల్పడుతోందనే విమర్శలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పులు, పరిపాలనా లోపాలపై సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం, గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) ఇందుకు ప్రధాన ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాజెక్టుకు అవసరమైన సుమారు 2,700 ఎకరాల భూసేకరణ, కేంద్ర అనుమతులు, మాస్టర్ ప్లాన్ రూపకల్పన వంటి కీలక పనులు జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వం(TDP) గతంలో శంకుస్థాపన చేసిన సమయంలో కేవలం 377 ఎకరాల భూమి మాత్రమే సేకరించబడిందని నాడు కనీస అనుమతులు కూడా లేవని. ఎన్నికల ముందు చంద్రబాబు(Chandra Babu Naidu) హడావిడి చేసి శంకుస్థాపన చేశారని కానీ ప్రస్తుతం ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మొత్తం ఘనతను తమదిగా ప్రచారం చేయడం వాస్తవాలను వక్రీకరించడమేనని విమర్శిస్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఆసియాలోనే అత్యంత పొడవైన జంట సొరంగాలను రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని వారు చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వ కాలంలో కేవలం 6.6 కిలోమీటర్ల మేర మాత్రమే సొరంగాల తవ్వకం జరగగా, వైఎస్సార్ మరియు జగన్ ప్రభుత్వాల కాలంలో కలిపి 30.9 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో జాప్యం చేస్తూ, చివరికి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మాత్రం తమ పేరు ముద్ర వేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

విశాఖపట్నం (Visakhapatnam) డేటా సెంటర్ (Data Center) ప్రాజెక్టుపైనా ఇదే తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.87 వేల కోట్ల పెట్టుబడితో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 2020లోనే జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, సింగపూర్ నుంచి సబ్-సీ కేబుల్ అనుసంధాన ప్రక్రియకు కూడా అప్పుడే శ్రీకారం చుట్టిందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం గూగుల్ పేరును ముందుకు తెచ్చి మొత్తం ప్రాజెక్టు తమ కృషి ఫలితమని ప్రచారం చేయడం ద్వారా అసలు చరిత్రను మరుగునపరుస్తున్నారని విమర్శిస్తున్నారు.

పరిశ్రమల విషయంలోనూ ఇదే తరహా ప్రచారం కొనసాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్రాజెక్టుపై అవగాహన 2022లో జగన్ దావోస్ పర్యటనలోనే కుదిరిందని, అలాగే కడప స్టీల్ ప్లాంట్ కోసం జేఎస్డబ్ల్యూ జిందాల్ సంస్థను ఒప్పించడం, అవసరమైన భూసేకరణ చేపట్టడం కూడా జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నింటినీ తమ విజయాలుగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శిస్తున్నారు.

ప్రభుత్వ పథకాల విషయంలో కూడా పేర్లు, రంగులు మార్చి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. 100 సంవత్సరాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమగ్ర భూ రీ-సర్వే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ప్లాటినం గ్రేడింగ్ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం అదే సర్వే ఆధారంగా, అదే క్యూఆర్ కోడ్, అదే నమూనాతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలకు కేవలం రంగు మార్చి కొత్తగా పంపిణీ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పాస్‌బుక్ ధరను పెంచి అదనపు భారం రైతులపై మోపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీడీవో) వ్యవస్థ కూడా కొత్తది కాదని 2020లోనే ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పిస్తూ డీఎల్డీవో వ్యవస్థను జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఇప్పుడు కేవలం పేరును మార్చి కొత్త ఆలోచనగా ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

పోలీస్ కానిస్టేబుల్ నియామకాల విషయంలో కూడా 2022లోనే జగన్ ప్రభుత్వం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమినరీ పరీక్షలు పూర్తి చేసిందని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కోర్టు కేసులతో ప్రక్రియకు ఆటంకం కలిగించినవారే, ఇప్పుడు నియామక పత్రాలు తమ ప్రభుత్వం ఇస్తోందంటూ ప్రచారం చేసుకోవడం రాజకీయ ప్రచారమేనని పేర్కొంటున్నారు.

ఆర్టీసీ బస్సుల కొనుగోలుపైనా ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వ కాలంలో రూ.700 కోట్లతో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసిన 1,459 బస్సులను ఇప్పుడు తమ ప్రభుత్వం తీసుకొచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది.

ఇవి మాత్రమే కాకుండా కర్నూలులో గోల్డ్ మైన్ ప్రాజెక్టు, తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటు, ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతుల పునరుద్ధరణ, గండి ఆలయ అభివృద్ద్ది వంటి అనేక అంశాల్లో కూడా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పరిపాలనలో ఫలితాలు చూపించలేకపోతున్న కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త రంగులు అద్దుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని పలు వర్గాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర అంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment