ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం (Coalition Government) తీవ్రమైన చట్టాలను సామాన్యులు, ఉద్యమకారులు, సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రయోగిస్తోందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. రైతు సంఘ నేతలు(Farmers’ Union Leaders), సామాజిక కార్యకర్తలు(Social Activists), డిజిటల్ జర్నలిస్టులు(Digital Journalists), సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇలా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై వరుసగా కఠిన చట్టాలు ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా పదే పదే నేరాలకు పాల్పడే కరడుగట్టిన రౌడీషీటర్లపై ప్రయోగించే పీడీ చట్టాన్ని ప్రజా ఉద్యమకారుడు, రైతు సంఘ నాయకుడు, సీపీఎం నేత అప్పలరాజుపై (Appalaraju) ప్రయోగించడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. ప్రజా సమస్యలపై పోరాడే నాయకులను అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి.
అదేవిధంగా తాజాగా యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై (Prashna Ravan) నమోదైన కేసుల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) కింద కేసు నమోదు కావడం మరింత ఆందోళనకు దారితీసింది. సాధారణంగా ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం లేదా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఉపయోగించే ఈ చట్టాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తిపై ప్రయోగించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికలు, న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల సోషల్ మీడియా కార్యకర్తలపై గంజాయి కేసులు నమోదు చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా కోర్టుల్లో నిలవకపోవడంతో, చట్టాలను రాజకీయ కక్షసాధింపునకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. పోలీసు వ్యవస్థ ప్రభుత్వ ఒత్తిడిలో పనిచేస్తోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఒకవైపు రైతు సంఘ నాయకుడిపై పీడీ చట్టం, మరోవైపు యూట్యూబర్‌పై యూఏపీఏ, ఇంకోవైపు సోషల్ మీడియా కార్యకర్తలపై మాదకద్రవ్యాల కేసులు నమోదు చేయడం వంటి పరిణామాలు రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తున్నాయని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ విధానాల్లోని లోపాలను, అసమానతలను ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి తీవ్రమైన చట్టాలను ప్రయోగించడం ద్వారా పౌర సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితి ఏర్పడుతోందని పౌరహక్కుల నేతలు, రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో, ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.






