ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) విద్యా వ్యవస్థలో (Education System) నెలకొన్న సమస్యలపై అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) (ABVP) ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ (Intermediate) నుంచి పీజీ(PG) వరకు అన్ని కాలేజీల బంద్కు (CollegesbBandh) పిలుపునిచ్చింది. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ నాయకులు ప్రచార పోస్టర్ను విడుదల చేసి బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. విద్యార్థుల ఉన్నత చదువులకు అడ్డంకిగా మారిందని పేర్కొంటూ జీవో నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని కోరింది. అలాగే పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో డిగ్రీ అడ్మిషన్లలో (Degree Admissions) జరుగుతున్న జాప్యం, విశ్వవిద్యాలయాల అకడమిక్ క్యాలెండర్లలో నెలకొన్న గందరగోళం, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న అక్రమాలపై కూడా ఏబీవీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ తనిఖీలు నామమాత్రంగా మారాయని, దీంతో విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొంది.
ప్రభుత్వ హాస్టళ్లలో (Government Hostels) సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే నాణ్యమైన భోజనం, మెరుగైన వసతి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేసింది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే అన్ని కాలేజీలకు ముందస్తు సమాచారం ఇచ్చామని తెలిపిన ఏబీవీపీ, ఆగస్టు 5న జరిగే రాష్ట్రవ్యాప్త కాలేజీల బంద్కు యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేసింది.







