ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మరోసారి కరోనా వైరస్ (Coronavirus) కలకలం రేపుతోంది. రాష్ట్రంలో తాజాగా 12 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 Positive Cases) నమోదుకావడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అయితే ఇవి ఒకే ప్రాంతంలో కాకుండా 4 జిల్లాల్లో విడివిడిగా నమోదయ్యాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ నిర్లక్ష్యం మాత్రం చేయొద్దని హెచ్చరించారు.
వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ (Veera Pandiyan) వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో మొత్తం 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి కరోనా కేసు జూన్ 26న కడప (Kadapa) జిల్లాలో గుర్తించగా, అనంతరం జూలై 1 నుంచి 16 వరకు మరో 11 కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో 2 మంది ఇప్పటికే కరోనా బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారేనని అధికారులు తెలిపారు.
జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు (Guntur) జిల్లాలో 2 కేసులు నమోదు కాగా, విశాఖపట్నం(Visakhapatnam), కాకినాడ (Kakinada) జిల్లాల్లో ఒక్కో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులన్నీ వేర్వేరు ప్రాంతాల్లో నమోదయ్యాయని, ఎక్కడా సామూహిక వ్యాప్తి లేదా క్లస్టర్ పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం నమోదైన 12 కేసుల్లో 3 మంది స్వీయ గృహ నిర్బంధంలో చికిత్స పొందుతుండగా, 2 మంది ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో 3 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇదే సమయంలో కరోనా పాజిటివ్‌గా తేలిన 4 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
మరణించిన వారిలో కడప జిల్లాకు చెందిన 3 మంది, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. అయితే వీరందరికీ ముందే తీవ్ర రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం కరోనా ఒక్కటే వారి మరణాలకు కారణమని చెప్పలేమని అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్ ఏ వేరియంట్‌కు చెందినదో తెలుసుకునేందుకు 5 నమూనాలను జూలై 9న పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపించారు. ఆ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత వైరస్ స్వరూపంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
జూన్ 26 నుంచి జూలై 15 వరకు రాష్ట్రంలో మొత్తం 67 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో వ్యక్తికి తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ కావడంతో రాష్ట్రానికి సంబంధించిన మొత్తం కేసుల సంఖ్య 12కు చేరింది.
దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూలై 1 నుంచి ఇప్పటివరకు దేశంలో 339 కేసులు నమోదయ్యాయి. కేరళలో 115 కేసులతో అత్యధికంగా నమోదు కాగా, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్‌లో 18, ఢిల్లీలో 18, రాజస్థాన్‌లో 12 కేసులు నమోదయ్యాయి.
ఈ పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.







