ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) భారీ పెట్టుబడులు(Investments), వేలాది ఉద్యోగాల పేరుతో కూటమి ప్రభుత్వం (Coalition Government) ప్రచారం చేసిన ప్రాజెక్టులపై (Projects) కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రూ. 76,250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్న ఎకోరెన్ ఎనర్జీ సంస్థ (EcoRen Energy Company) మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసన్న యెర్నేని జీఎస్టీ (GST) అధికారుల దర్యాప్తులో అరెస్ట్ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
జీఎస్టీ శాఖ ఆరోపణల ప్రకారం, ఎలాంటి వస్తువులు లేదా సేవలు సరఫరా చేయకుండా కేవలం నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి రూ. 64.5 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ (Input Tax) క్రెడిట్ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ కేసులో అరెస్టు చేసిన ఎండీని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆగస్టు 7 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైలులో ఉన్నారు.
ఈ పరిణామాల మధ్య, ఎకోరెన్ ఎనర్జీ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములపై(Lands) కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారిక ఉత్తర్వుల ప్రకారం, నంద్యాల జిల్లా బేతంచర్ల, డోన్ మండలాల్లో మొత్తం 61.74 ఎకరాలు, వైఎస్సార్ కడప జిల్లా బి.మఠం మండలంలో 185.58 ఎకరాల భూమిని దీర్ఘకాలిక లీజుకు కేటాయించారు. ఈ భూములను ఎకరాకు సంవత్సరానికి రూ. 31,000 లీజు చొప్పున ఇచ్చినట్లు ఉత్తర్వులు పేర్కొంటున్నాయి.
అదనంగా, నంద్యాల జిల్లాలో ప్రాజెక్టు(Project) కోసం భూసేకరణలో భాగంగా 547 మంది ఆక్రమణదారులకు చెల్లించాల్సిన రూ. 5.90 కోట్ల పరిహారం విషయంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకున్నట్లు సమాచారం.
స్వల్ప మూలధనంతో నమోదైన సంస్థలు, తక్కువ అనుభవం కలిగిన డైరెక్టర్లతో ఉన్న కంపెనీలకు వందల ఎకరాల భూములు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కేటాయించడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సరైన పరిశీలన లేకుండానే విలువైన ప్రభుత్వ భూములను లీజుకు ఇవ్వడం పరిపాలనా వైఫల్యమని ఆరోపిస్తున్నాయి.
ఎకోరెన్ ఎనర్జీ వ్యవహారం వెలుగులోకి రావడంతో, కూటమి ప్రభుత్వం ప్రకటించిన భారీ పెట్టుబడుల విశ్వసనీయతపై ప్రజల్లో సందేహాలు పెరుగుతున్నాయని, ఈ అంశంపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.







