ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ప్రభుత్వ పాఠశాలలు(Government Schools), విద్యాసంస్థల్లో (Educational Institutions) విద్యార్థుల సంఖ్య (Student Strength) భారీగా తగ్గినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) శాసనమండలిలో (Legislative Council) వెల్లడించిన గణాంకాలు చర్చకు దారితీశాయి. గత మూడేళ్లలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఏకంగా 5,88,419 మంది విద్యార్థులు తగ్గిపోయినట్లు ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో (YS Jagan Government Tenure) ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు 40,50,031 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొనగా.. తాజా గణాంకాల ప్రకారం ఆ సంఖ్య 34,61,612కు పడిపోయింది. అంటే మూడేళ్ల వ్యవధిలోనే దాదాపు 5.88 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థలకు దూరమైనట్లు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంపై వైఎస్సార్సీపీ(YSRCP) సభ్యులు శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ ఈ వివరాలను వెల్లడించారు. 1వ తరగతి (Class 1) నుంచి ఇంటర్మీడియట్ (Intermediate) వరకు విద్యార్థుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను ప్రభుత్వం సభ ముందుంచింది.
ఈ భారీ తగ్గుదలపై విద్యా రంగంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పరిస్థితి, విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజనంలో (Mid-Day Meals) నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులు, ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) ఘటనలు, తాగునీటి సమస్యలు(Drinking Water Issues), పాఠశాలల్లో విద్యార్థుల ఆందోళనలు వంటి అంశాలు ప్రభుత్వ విద్యపై ప్రభావం చూపుతున్నాయా అనే చర్చ మొదలైంది.
అదే సమయంలో తల్లికి వందనం (Thalliki Vandanam) వంటి పథకాల అమలులో భారీ కోతలు, నాడు–నేడు (Nadu-Nedu) పనుల నిలిపివేత, పాఠశాలల నిర్వహణలో లోపాలు వంటి అంశాలపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల మౌలిక వసతులపై నిర్లక్ష్యం కారణంగా ప్రహరీ గోడలు, ఇతర నిర్మాణాలు దెబ్బతిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ఆందోళనలను పెంచుతున్నాయి.
విద్యాశాఖ మంత్రి స్వయంగా వెల్లడించిన 5,88,419 మంది విద్యార్థుల తగ్గుదలపై వైఎస్సార్సీపీ మరింతగా ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. ఈ గణాంకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా వ్యవస్థ పనితీరుపై మరోసారి తీవ్ర చర్చకు తెరలేపుతున్నాయి.









