---Advertisement---

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రజాధనం.. చంద్రబాబు సర్కార్‌ తీరుపై విమర్శలు?

September 29, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలు(Government Schemes), అభివృద్ధి కార్యక్రమాలు(Development Programs), ప్రజా అవగాహన ప్రచారాలను (Public Awareness Campaigns) సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రభుత్వం జీవో 197 ద్వారా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల(Social Media Influencers) ఎంప్యానెల్‌మెంట్‌(Empanelment) విధానాన్ని తీసుకొచ్చింది. ఫేస్‌బుక్‌(Facebook), ఇన్‌స్టాగ్రామ్‌(Instagram), యూట్యూబ్‌(YouTube), ఎక్స్‌(X) వంటి వేదికల్లో కనీసం 10 వేల మంది ఫాలోవర్లు ఉన్న కంటెంట్‌ క్రియేటర్లను ఎంపిక చేసి, వారి రీచ్‌, వైరల్‌ కంటెంట్‌, పోస్టింగ్‌ యాక్టివిటీ ఆధారంగా కేటగిరీలుగా విభజించేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఎంప్యానెల్‌మెంట్‌ ప్రారంభంగా ఏడాది పాటు ఉండగా, పనితీరు ఆధారంగా మరో రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది.

అయితే, ఈ విధానం ఇప్పుడు రాజకీయంగా, ప్రజాధన వినియోగం పరంగా చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమాచార, పౌర సంబంధాల శాఖ, ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ (AP Digital Corporation) వంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంప్యానెల్‌ చేసి పారితోషికాలు చెల్లించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రతిపక్షాల ఆరోపణల ప్రకారం.. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా కంటెంట్‌ క్రియేటర్లకు ‘ఇన్‌ఫ్లుయెన్సర్లు’ అనే పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రయోజనం కల్పించే అవకాశం ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రజాధనంతో నిర్వహించే ప్రభుత్వ ప్రచారం రాజకీయంగా తటస్థంగా, పారదర్శకంగా ఉండాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో ఎంపిక ప్రక్రియ, చెల్లింపులు, ప్రచార ఫలితాలను బహిరంగంగా వెల్లడించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రం అప్పుల భారంతో(Debt Burden) ఉందని విమర్శలు వస్తున్న సమయంలో ప్రభుత్వ ప్రచారానికి అదనపు ప్రజాధనం ఖర్చు చేయడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంప్యానెల్‌ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్ల జాబితా ఏమిటి? ఒక్కొక్కరికి ఎంత చెల్లిస్తారు? మొత్తం ప్రచార వ్యయం ఎంత? ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఇప్పటికే ఉన్న అధికారిక వ్యవస్థలను పక్కనబెట్టి కొత్త విధానం ఎందుకు తీసుకొచ్చారు? ఈ ప్రచారం వల్ల ప్రజలకు కలిగే అదనపు ప్రయోజనం ఏమిటి? వంటి ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ప్రచార వ్యవస్థను మరింత విస్తరించేందుకు తీసుకొచ్చిన విధానమా? లేక సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ అనుకూల ప్రచారాన్ని పెంచేందుకు రూపొందించిన కొత్త మార్గమా? అనే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment