ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) నిర్వహించిన మెగా డీఎస్సీపై (Mega DSC) వైఎస్సార్‌సీపీ(YSRCP) నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తీవ్ర ఆరోపణలు చేశారు. నారా లోకేష్(Nara Lokesh) తన శాఖను పట్టించుకోకుండా అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటూ చిత్ర విచిత్రాలు, టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నాడని మండిపడ్డారు. గురువుల నియామకాల విషయంలో విద్యాశాఖ చేసిన తప్పులు ఒక్కటిరెండుకాదని విమర్శించారు.
99 పైసలకే భూములు (Lands) ఇచ్చి భారీగా సంపాదిస్తున్నారని, అమరావతిలో (Amaravati) అడుగుకు రూ.20 వేల చొప్పున కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు పోగేస్తున్నారని ఆరోపించారు. గురువుల నియామకాలలో కూడా అవకతవకలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. సమాజానికి నష్టం చేస్తున్నామనే బాధ కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 16 వేలకుపైగా టీచర్ పోస్టుల (Teacher Posts) భర్తీ పేరుతో మెగా డీఎస్సీ పేరుతో ప్రజలను మోసం చేశారని అన్నారు.
మెగా డీఎస్సీ నిజంగా పారదర్శకంగా నిర్వహించి ఉంటే మెరిట్ లిస్ట్ (Merit List) ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. అభ్యర్థులకు వచ్చిన మార్కులు వెల్లడించకుండా కేవలం ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్నారని ఆరోపించారు. ఎంత డబ్బు ఇస్తే అంత ర్యాంకు ఇస్తున్నారా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యాశాఖ నుంచి వచ్చిన ప్రకటనలపై కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
డీఎస్సీపై ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. తప్పుడు పనులు చేస్తూ ప్రశ్నించిన వారిని జైలుకు(Jail) పంపిస్తారా అంటూ నిలదీశారు. 2012లో స్పోర్ట్స్ కోటాలో 2 శాతం రిజర్వేషన్ (Reservation) ఇవ్వాలని జీవో వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 2024 ఏప్రిల్ 19న జీవో నెంబర్ 47, జీవో నెంబర్ 4ను విడుదల చేశారని తెలిపారు.
డీఎస్సీ(DSC), టెట్(TET) పరీక్షలు కూడా రాయకుండానే 3 శాతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. 29 ఆటలను 67 ఆటలుగా మార్చారని, బచ్చాలు, గోళీలాటలు తప్ప అన్ని ఆటలను జాబితాలో చేర్చారని ఎద్దేవా చేశారు. దొడ్డిదారిన 421 మందిని వ్యాయామ ఉపాధ్యాయులుగా (Physical Education Teachers) నేరుగా నియమించుకున్నారని ఆరోపించారు. ఇది అతిపెద్ద అవినీతి కాదా అంటూ ప్రశ్నించారు.
స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 421 మంది సర్టిఫికెట్లను బయటపెట్టే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అంటూ ఛాలెంజ్ విసిరారు. సినిమా డైలాగులు చెప్పడం కాదని, నిజంగా నిజాయితీ ఉంటే ఎంపికైన వారి వివరాలు, మెరిట్ లిస్ట్, స్పోర్ట్స్ కోటా వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
బాలకృష్ణ (Balakrishna) సినిమాలు చేసి డబ్బులు సంపాదిస్తే, లోకేష్ స్కామ్‌లు (Lokesh Scams) చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ(CBI) విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిజాయితీగా రిక్రూట్‌మెంట్ జరిగి ఉంటే పూర్తి వివరాలు బయటపెట్టాలని మరోసారి సవాల్ విసిరారు.






