ప్రజాస్వామ్యంలో (Democracy) రాజకీయ నాయకులు(Political Leaders) మారుతుంటారు. కానీ పరిపాలన వ్యవస్థకు వెన్నెముకలుగా నిలిచేది ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS) వంటి ఉన్నతాధికారులే. దేశంలో అత్యంత కఠినమైన పోటీ పరీక్షలను ఎదుర్కొని, ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేసి, కుటుంబానికి దూరంగా ఉండి, జీవితాన్ని పణంగా పెట్టి ఆ స్థాయికి చేరుకుంటారు. అలాంటి అధికారులను రాజకీయ ఆరోపణల పేరుతో లక్ష్యంగా చేయడం, వారి సేవలను అనుమానాస్పదంగా చూపించడం కేవలం వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు — పరిపాలనా వ్యవస్థపై (Administrative System) ప్రజల నమ్మకాన్నే దెబ్బతీసే చర్యగా చూడాలి.
ఒక అధికారి తన కెరీర్ మొత్తం కష్టపడి సంపాదించుకున్న పేరు, ప్రతిష్ట, సమాజంలో నిలబెట్టుకున్న గౌరవం ఒక్కసారిగా రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటే, ఆ మానసిక వేదన ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడం కూడా కష్టం. ఆరోపణలు ఎదుర్కొనే అధికారి మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలు, బంధువులు కూడా సామాజిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కోర్టులో నిజం తేలకముందే మీడియాలో, రాజకీయ వేదికలపై వారిని నిందితులుగా చిత్రీకరించడం వల్ల వారు కోల్పోయిన పరువు, కుటుంబం అనుభవించిన అవమానం, వారి పిల్లలు సమాజం ముందు నిలబడినప్పుడు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి ఉహాకి సైతం అందని విధంగా ఉంటుంది. ఈ నేపధ్యంలో వారి జీవితాలు శాశ్వతంగా ప్రభావితమవుతాయని పరిపాలనా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో టీడీపీ(TDP) అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అధికారులపై కేసులు, సస్పెన్షన్లు, అరెస్టులు వరుసగా చోటుచేసుకోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghurama Krishnam Raju) కస్టడీ వ్యవహారంలో సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ ఆర్. విజయ్‌పాల్ (R. Vijay Pal) అరెస్టు కావడం, అప్పటి సీఐడీ అదనపు డీజీపీ పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) సస్పెండ్ కావడం అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. తాము కేవలం చట్టపరమైన విధులు నిర్వర్తించామని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వేదింపులకు గురి చేస్తున్నారని సంబంధిత అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముంబై నటి జెత్వానీ (Jethwani) వ్యవహారం కూడా ఇదే చర్చను మరింత ముదిరేలా చేసింది. సీఐడీ కోర్టులో(CID Court) సమర్పించిన పత్రాల్లో జెత్వానీని బ్లాక్‌మెయిలర్‌గా పేర్కొన్న తర్వాత, ఆ కేసు ఆధారంగా చూపి ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేదించారనే విమర్శలు వినిపించాయి. పీఎస్సార్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, కాంతిరాణ టాటా, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ వంటి అధికారులపై తీసుకున్న చర్యలు ఫక్తు రాజకీయ ప్రతీకారమా అనే ప్రశ్నలు ఇప్పుడు బహిరంగంగా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా పీఎస్సార్ ఆంజనేయుల (PSR Anjaneyulu) అరెస్టు తర్వాత ఆయన కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులు అధికార వర్గాల్లో సానుభూతిని రేకెత్తించాయి.
నకిలీ మద్యం కేసులలో అధికారుల అరెస్టులు, తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదంలో టిటిడి(TTD) కొనుగోలు విభాగం అధికారులపై చర్యలు — ఇవన్నీ కలిపి చూస్తే “రాజకీయ నిర్ణయాల అమలులో భాగమైన అధికారులు తర్వాత బలిపశువులుగా మారుతున్నారా?” అనే సందేహం బలపడుతోంది. విధి నిర్వహణ సమయంలో తీసుకున్న నిర్ణయాలు తరువాత రాజకీయ పరిస్థితులు మారినప్పుడు స్వలాభం కోసం నేరాలుగా పనికట్టుకుని చిత్రీకరిస్తే, భవిష్యత్తులో అధికారులు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
గత రెండు దశాబ్దాల్లో పలువురు సీనియర్ అధికారుల పేర్లు వివిధ కేసుల్లో వినిపించాయి. ఆదిత్యనాథ్ దాస్, శామ్యూల్(Samuel), రత్నప్రభ, శ్యాంబాబు, మురళీధర్ రెడ్డి, బి.పి. ఆచార్య, ఎస్.ఎన్. మొహంతి, శ్రీలక్ష్మి, బ్రహ్మానందరెడ్డి వంటి అనేక మంది అధికారులపై విచారణలు, కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న కొందరు “ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధులు నిర్వహించిన అధికారులే మొదటి లక్ష్యాలుగా మారడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య సంకేతమా? అని వేదింపులకి గురిచేస్తున్న పార్టీ నాయకులని పర్సనల్ స్పేస్ లో నిలదీసిన సంధర్భాలు ఉన్నాయి.”
చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేసిన వారిపై చర్య తప్పనిసరి. అయితే ఆరోపణలు, విచారణ, కోర్టు తీర్పు అనే ప్రక్రియ పూర్తికాకముందే అధికారులను ప్రజల ముందు కేవలం ప్రత్యర్ధిని రాజకీయంగా దెబ్బకొట్టాలనే ఆలోచనతో దోషులుగా నిలబెట్టడం వారి జీవితాలను ఛిద్రము చేస్తుందని పరిపాలనా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓడినా తిరిగి పోటీ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఒక అధికారి కోల్పోయిన పరువు, కుటుంబం అనుభవించిన అవమానం, పిల్లలు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టమని వారి నుండి వినిపిస్తున్న మాట. రాజకీయాలు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, కానీ పరిపాలనా వ్యవస్థను రాజకీయ ప్రతీకారాలకు వేదికగా మార్చకూడదని పలువురు అధికారుల నుండి వినిపిస్తున్న మాట.







