తెలంగాణలో(Telangan) మరోసారి ఏపీ పోలీసుల(AP Police) చర్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తెలంగాణ జర్నలిస్ట్ (Journalist) కేవీ రెడ్డిని (KV Reddy) ఏపీ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకోవడం, అదే రోజున ప్రముఖ యూట్యూబ్ ఛానల్ (YouTube Channel) “ప్రశ్న”(Prashna) ప్రతినిధి రావణ్‌ను (Ravan) కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కేవీ రెడ్డి (KV Reddy) కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, గత రాత్రి ఏపీ పోలీసులు హైదరాబాద్‌కు (Hyderabad) చేరుకుని సరైన కారణాలు వెల్లడించకుండా వారెంట్ (Warrant) ఉందని చెబుతూ బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మహిళ అని కూడా చూడకుండా తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కేవీ రెడ్డి సతీమణి ఆరోపించారు. ఈ ఘటనపై ఆమె తెలంగాణ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కేవీ రెడ్డి గతంలో కూడా కర్నూలు పోలీసులు(Police) తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని ఆరోపిస్తూ హైకోర్టులో (High Court) హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా విడుదలైన విషయం తెలిసిందే. అనంతరం విజయనగరం పోలీసులు కూడా తన వ్యాఖ్యలను వక్రీకరించి అరెస్టు చేయాలని ప్రయత్నించారని, తెలంగాణ జర్నలిస్టులు అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారని ఆయన అప్పట్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని ఆరోపిస్తూ “ప్రశ్న” యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి రావణ్‌ను కూడా ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే రావణ్ మద్దతుదారులు మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో పవన్ కళ్యాణ్ ఉపయోగించిన పదాలను ఉదహరిస్తూ చేసినవేనని, వాటికి మించి వ్యక్తిగతంగా అవమానించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వాదిస్తున్నారు. అలాగే గతంలో రాధా మనోహర్ దాస్ క్రైస్తవ మతంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని మాత్రమే ప్రశ్నించారని, ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారని చెబుతున్నారు.
ఒకే రోజు హైదరాబాద్‌లో ఓ జర్నలిస్టు, మరో యూట్యూబ్ ఛానల్ ప్రతినిధిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అరెస్టులకు సంబంధించి అధికారికంగా ఏపీ పోలీసులు ఎలాంటి కారణాలు వెల్లడిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారంపై జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు స్పందిస్తూ అధికారిక వివరణ కోసం ఎదురుచూస్తున్నాయి.






