---Advertisement---

ఐఫోన్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. భారత్‌లో ప్రారంభమైన ‘యాపిల్ పే’ సేవలు!

September 30, 2026

Summarize with AI

---Advertisement---

యాపిల్ వినియోగదారులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తన కాంటాక్ట్‌లెస్ డిజిటల్ పేమెంట్ సర్వీస్ యాపిల్ పే (Apple Pay)ను భారత్‌లో అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం ద్వారా దేశీయ మార్కెట్లో యాపిల్ పే సేవలను ప్రారంభించింది.

ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ వినియోగదారులు తమ పరికరాల్లోని యాపిల్ వాలెట్ (Apple Wallet) ద్వారా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. త్వరలో మ్యాక్ (Mac) కంప్యూటర్లలోనూ యాపిల్ పే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్(Axis Bank) జారీ చేసిన వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డులను యాపిల్ వాలెట్‌కు జోడించుకునే అవకాశం ఉంది. అనంతరం ఎన్‌ఎఫ్‌సీ (NFC) సదుపాయం ఉన్న రిటైల్ స్టోర్లలో ఐఫోన్ లేదా యాపిల్ వాచ్‌ను ట్యాప్ చేయడం ద్వారా చెల్లింపులు పూర్తి చేయవచ్చు.

ఆన్‌లైన్‌లోనూ యాపిల్ పే ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ప్రముఖ యాప్స్, వెబ్‌సైట్లలో కొనుగోళ్ల సమయంలో యాపిల్ పేను చెల్లింపు మార్గంగా ఎంచుకుని లావాదేవీని పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

భారత్‌లో డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యాపిల్ పే ప్రవేశం ప్రాధాన్యత సంతరించుకుంది. యాపిల్ పే, యాపిల్ వాలెట్ విభాగాల వైస్ ప్రెసిడెంట్ జెన్నిఫర్ బెయిలీ మాట్లాడుతూ.. సాంకేతికతను వేగంగా స్వీకరించడంతో పాటు భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులు భారత్‌లో ఉన్నారని తెలిపారు.

యాపిల్ పేలో చెల్లింపులు చేసేటప్పుడు వినియోగదారుల కార్డు వివరాలు వ్యాపారులకు నేరుగా చేరకుండా భద్రతా వ్యవస్థను రూపొందించారు. ఫేస్ ఐడీ (Face ID), టచ్ ఐడీ (Touch ID) వంటి బయోమెట్రిక్ విధానాల ద్వారా లావాదేవీలను ధృవీకరించి చెల్లింపులు పూర్తి చేయవచ్చు.

ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ కార్డులతో ప్రారంభమైన యాపిల్ పే సేవలను భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు, చెల్లింపు నెట్‌వర్క్‌లకు విస్తరించనున్నట్లు యాపిల్ తెలిపింది. దీంతో రానున్న రోజుల్లో భారత్‌లోని యాపిల్ వినియోగదారులకు మరిన్ని కార్డులు, బ్యాంకింగ్ సేవలతో యాపిల్ పేను ఉపయోగించే అవకాశం లభించనుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment