ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా ముగిసింది. లీగ్ దశ చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలిచే శక్తి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కే ఉందని అక్షర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ అనంతరం మాట్లాడిన అక్షర్ పటేల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. ముఖ్యంగా టాప్-3 బ్యాటర్లు ఒకసారి సెటిల్ అయితే వారిని ఆపడం ఏ బౌలింగ్ యూనిట్ వల్ల కూడా కాదని హెచ్చరించాడు. ప్లేఆఫ్స్ లాంటి కీలక మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు విజృంభిస్తే ప్రత్యర్థి జట్లకు భారీ ప్రమాదమేనని పేర్కొన్నాడు.
ఇటీవల టేబుల్ టాపర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది.
ఇప్పుడు మే 27న న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ స్టేడియంలో జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు అక్షర్ చేసిన వ్యాఖ్యలు ఎస్‌ఆర్‌హెచ్ అభిమానుల్లో మరింత జోష్ నింపుతున్నాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన అక్షర్ పటేల్.. “ఎస్‌ఆర్‌హెచ్ చాలా బలమైన జట్టు. ముఖ్యంగా వారి టాప్-3 బ్యాటర్లు క్లిక్ అయితే ఆ జట్టును ఓడించడం ఎవరికైనా చాలా కష్టం” అని స్పష్టం చేశాడు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శనపై స్పందించిన అక్షర్.. ఈ సీజన్‌లో కీలక సమయాల్లో తమ జట్టు అవకాశాలను చేజార్చుకుందని అంగీకరించాడు. ఢిల్లీ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది. టోర్నమెంట్ మధ్యలో వరుస ఓటములతో తీవ్ర ఒత్తిడిలో పడిన ఢిల్లీ.. చివర్లో వరుసగా 3 విజయాలు సాధించినప్పటికీ ప్లేఆఫ్స్ చేరడానికి అవి సరిపోలేదు. దీంతో వరుసగా 5వ ఏడాది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు దూరమైంది.
తమ వైఫల్యంపై అక్షర్ మాట్లాడుతూ.. “మనం చేసిన తప్పులను ఒప్పుకున్నప్పుడే ఎక్కడ మెరుగుపడాలో అర్థమవుతుంది. ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో కీలక క్షణాలను మాకు అనుకూలంగా మార్చుకుని ఉంటే పరిస్థితి పూర్తిగా మారిపోయేది. మేము మంచి క్రికెట్ ఆడాం.. కానీ కొన్ని కీలక సందర్భాల్లో తడబడ్డాం” అని చెప్పుకొచ్చాడు.






