విజయనగరం జిల్లా భోగాపురం (Bhogapuram) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరోసారి “క్రెడిట్ చోరీ” (Credit Theft) చేశారని వైసీపీ(YSRCP) రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) హయాంలోనే విమానాశ్రయ నిర్మాణ పనుల్లో 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనులను పూర్తి చేసి మొత్తం ఘనత తమదేనని చెప్పుకోవడం సమంజసం కాదని విమర్శించారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కావడం స్వాగతించదగ్గ విషయమేనని పేర్కొన్న సజ్జల, అయితే గత నెల రోజులుగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలిసి వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేశారని ఆరోపించారు. చంద్రబాబు తన పాలనలో చేసిన పనుల కంటే ఇతరుల కృషిని తన ఖాతాలో వేసుకోవడం అలవాటుగా మార్చుకున్నారని, హైదరాబాద్ నిర్మాణం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు ఇదే ధోరణి కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, భోగాపురం అంశంలో క్రెడిట్ తీసుకోవడమే కాకుండా, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడం మరింత అభ్యంతరకరమని అన్నారు. జగన్ చెప్పని మాటలను చెప్పినట్లుగా ప్రచారం చేసి విమర్శలు చేయడం కూటమి నాయకుల దివాలాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన తీర్పు ఇస్తారని చంద్రబాబు గుర్తుంచుకోవాలని సూచించారు.
2023లో భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, 2024 ఎన్నికల నాటికి సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయని సజ్జల తెలిపారు. భూసేకరణ, పునరావాస కార్యక్రమాల కోసం సుమారు రూ.1,200 కోట్ల వ్యయం చేసి జగన్ ప్రభుత్వం కీలక పనులు పూర్తి చేసిందని అన్నారు. మిగిలిన 20 శాతం పనులను పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వానికి దాదాపు రెండేళ్లు పట్టిందని విమర్శించారు.
విశాఖపట్నంలో అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు కేటాయించారని కూడా సజ్జల ఆరోపించారు. సుమారు రూ.30 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే అప్పగించారని, లోకేష్‌కు(Nara Lokesh) బంధుత్వం ఉన్న వ్యక్తికి సుమారు రూ.5 వేల కోట్ల విలువైన భూములు కేటాయించారని ఆయన ఆరోపించారు.







