భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం నేపథ్యంలో రాజకీయ క్రెడిట్ పోటీ మళ్లీ మొదలైంది. ఒకవైపు టీడీపీ ఈ ప్రాజెక్టు పూర్తిగా చంద్రబాబు నాయుడు విజన్ ఫలితమని ప్రచారం జరుగుతుండగా, మరోవైపు ప్రాజెక్టును నిజంగా పట్టాలెక్కించి నిర్మాణ దశకు తీసుకెళ్లింది జగన్ ప్రభుత్వమేనని ప్రతివాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని పక్కనపెట్టి కాలక్రమాన్ని పరిశీలిస్తే అసలు విషయం కనిపిస్తుంది అంటూ సామాజిక వేత్తల నుండి వినిపిస్తున్న మాట.
భోగాపురం విమానాశ్రయం పేరుతో తొలి ప్రతిపాదన వచ్చినప్పుడు దానికి అవసరమంటూ ఏకంగా 15 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. అంత భారీ స్థాయిలో భూములు తీసుకోవాల్సిన అవసరం ఏమిటని స్థానిక రైతులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా రైతుల పక్షాన నిలబడి, అవసరానికి మించిన భూసేకరణను వ్యతిరేకించారు.
రైతుల ఉద్యమాలు, రాజకీయ ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ క్రమంగా తగ్గింది. అయినప్పటికీ భూసేకరణ నోటిఫికేషన్, పరిహారం, నిర్వాసితుల పునరావాసం వంటి అంశాలపై తీవ్ర వివాదాలు కొనసాగాయి. రైతులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయపరమైన చిక్కులు అలాగే ఉండగానే 2019 ఎన్నికలకు ముందు భోగాపురం విమానాశ్రయానికి ఎలాంటి మౌళిక అనుమతులు లేకుండా చంద్రబాబు ఆద్వర్యంలో శంకుస్థాపన జరిగింది. కానీ అప్పటికి నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైన కీలక అనుమతులు, భూసేకరణ, న్యాయపరమైన అంశాలు పూర్తికాలేదన్న విమర్శలు అప్పుడే వచ్చాయి.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కొత్త దశలోకి తీసుకెళ్లింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సైట్ క్లియరెన్స్ సాధించడం, జీఎంఆర్‌తో కన్సెషన్ ఒప్పందాన్ని అమలు దశకు తీసుకెళ్లడం, విశాఖ పాత విమానాశ్రయానికి సంబంధించిన నిరభ్యంతర పత్రం పొందడం, పర్యావరణ అనుమతుల బదిలీ, విమాన భద్రతకు సంబంధించిన ఒప్పందాలు పూర్తి చేయడం వంటి కీలక పరిపాలనా ప్రక్రియలు ఈ కాలంలోనే జరిగాయి.
అంతేకాదు, భూసేకరణపై రైతులు వేసిన ప్రధాన కేసులు హైకోర్టులో కొట్టివేయబడటం, పెండింగ్‌లో ఉన్న పరిహార వివాదాలకు ప్రభుత్వం చట్టపరమైన పరిష్కార మార్గాన్ని అనుసరించడం వల్ల నిర్మాణానికి ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగాయి. అవసరమైన భూమిని సేకరించి జీఎంఆర్‌కు అప్పగించడం, రైతులకు గతంలో ప్రకటించిన దానికంటే ఎక్కువ పరిహారం అందించడం, నిర్వాసితులకు పునరావాస కాలనీలు నిర్మించడం వంటి అంశాలు కూడా ఈ దశలోనే పూర్తయ్యాయి.
అయితే ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రచారం ఏమిటంటే—జగన్ భోగాపురం విమానాశ్రయాన్నే వ్యతిరేకించారనేది. కానీ 2015లో జరిగిన సభలు, అప్పటి ప్రకటనలను పరిశీలిస్తే ఆయన అభ్యంతరం విమానాశ్రయ నిర్మాణంపై కాదు; 15 వేల ఎకరాల భారీ భూసేకరణపైనే. అదే సమయంలో టీడీపీతో విభేదించిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రైతుల నుంచి భారీగా భూములు తీసుకోవడాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. మరి ఆ లెక్కన ఆయన కూడా విమానాశ్రయ వ్యతిరేకేనా అనే ప్రశ్నకు ప్రచారం చేస్తున్నవారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. 2019 ఎన్నికలకు ముందు భోగాపురం విమానాశ్రయంతో పాటు కుప్పం విమానాశ్రయానికి కూడా శంకుస్థాపన జరిగింది. అయితే భోగాపురం నిర్మాణం ముందుకు సాగగా, కుప్పం విమానాశ్రయం మాత్రం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీనిని బట్టి శంకుస్థాపన చేయడం ఒకటి, ప్రాజెక్టును అనుమతుల నుంచి నిర్మాణ దశకు తీసుకెళ్లడం మరోటి అనే వాదన బలపడుతోంది.
అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసిన వారే ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత దక్కుతుందా? లేక అన్ని అనుమతులు, భూసేకరణ, న్యాయపరమైన అడ్డంకులు, నిర్మాణానికి అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి శంకుస్థాపన చేసి ప్రాజెక్టును కార్యరూపం దాల్చేలా చేసినవారికీ గుర్తింపు దక్కాలా అనే ప్రశ్నకు సమాధానం పెద్దగా ఆలోచన చేయకుండానే చెప్పగల అంశం. ఈ నేపధ్యంలో క్రెడిట్ పోరులో జగన్ కే ప్రజల మద్దతు దక్కే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది.







