ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాభివృద్ధి, భారీ పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి పేరుతో కుదిరిన కొన్ని ఒప్పందాలపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా ‘ఎంవోయూ’లు(MoUs), పెట్టుబడి ప్రకటనలు(Investment Announcements), ప్రభుత్వ భూముల కేటాయింపుల (Government Land Allotments) విషయంలో కంపెనీల విశ్వసనీయతను పూర్తిస్థాయిలో పరిశీలించకుండా నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో సింగపూర్‌తో (Singapore) అమరావతి రాజధాని నిర్మాణానికి (Amaravati Capital Construction) సంబంధించిన ఒప్పందాల నుంచి ప్రస్తుత పాలనలో గ్రీన్ ఎనర్జీ రంగంలోని ఎకోరన్ ఎనర్జీ (Ecoran Energy) వ్యవహారం, విశాఖకు చెందిన డేటాప్రో కంప్యూటర్స్‌పై (Datapro Computers) జమ్మూ కశ్మీర్‌లో వచ్చిన ఆరోపణలు, అలాగే 90వ దశకంలో కుప్పంలోని బీహెచ్‌సీ ప్రాజెక్టు (BHC Project) వరకు పలు ఉదంతాలను ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. ఈ వ్యవహారాలన్నింటినీ ఒకే కోణంలో చూస్తే ప్రభుత్వ ఒప్పందాల పారదర్శకత, భాగస్వామ్య సంస్థల నేపథ్య పరిశీలన, ప్రజా ఆస్తుల పరిరక్షణపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని వారు అంటున్నారు.
అమరావతి ప్రాజెక్టు సమయంలో చంద్రబాబు ప్రభుత్వంతో (Chandrababu Government) సన్నిహితంగా వ్యవహరించిన సింగపూర్ మాజీ మంత్రి ఎస్. ఈశ్వరన్‌పై (S. Iswaran) అవినీతి కేసు నమోదై, ఆయనకు జైలు శిక్ష పడిన విషయం కూడా అప్పటి ఒప్పందాలపై రాజకీయ చర్చకు కారణమైంది. అవినీతిపరుడిని రాష్ట్ర రాజధాని అభివృద్దిలో భాగస్వామ్యం చేయడం పలు అనుమానాలకి కారణం అయింది.
ఇక ఎకోరన్ ఎనర్జీకి సంబంధించి భారీ పెట్టుబడుల ప్రకటనలు, కంపెనీ ఆర్థిక సామర్థ్యం, కేంద్ర జీఎస్టీ అధికారుల చర్యలు వంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కంపెనీ నిర్వాహకులపై పన్ను మోసానికి సంబంధించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఇంత భారీ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను ప్రభుత్వం ఏ స్థాయిలో పరిశీలించిందనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.
ఇక తాజాగా డేటాప్రో కంప్యూటర్స్ విషయంలోనూ జమ్మూ కశ్మీర్‌లో హిమాయత్ కార్యక్రమానికి సంబంధించిన అవకతవకల ఆరోపణలను ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. శిక్షణ, నకిలీ అభ్యర్థులు, నకిలీ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్న సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన యువత శిక్షణ కార్యక్రమాల్లో అవకాశం కల్పించడం ఎందుకు జరిగిందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఇక 90వ దశకంలో కుప్పం బీహెచ్‌సీ ప్రాజెక్టు పాత వ్యవహారం కూడా మరో ఉదాహరణగా ప్రస్తావించబడుతోంది. ఇజ్రాయెల్ సాంకేతికత(Israeli Technology), ఆధునిక వ్యవసాయం పేరుతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో రైతుల భూములు, లీజులు, రుణాలు, జపాన్ గ్రాంట్ వినియోగం వంటి అంశాలపై గతంలోనే వివాదాలు తలెత్తాయి. ఈ వ్యవహారంపై కమిషన్ నివేదికలు, వాటి అమలు తదితర అంశాలు కూడా రాజకీయంగా చర్చకు వచ్చాయి.
ఈ తీవ్రమైన ఆరోపణల నేపధ్యంలో కూటమి ప్రభుత్వం కుదుర్చుకునే ఎంవోయూలు నిజమైన పెట్టుబడులుగా మారుతున్నాయా? కంపెనీల ఆర్థిక సామర్థ్యం, గత చరిత్రను పరిశీలిస్తున్నారా? ప్రభుత్వ భూములు, ప్రజా నిధుల విషయంలో తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.
పెట్టుబడుల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ ప్రకటనలు చేయడం కంటే వాటి అమలు, ఉద్యోగాల సృష్టి, రాష్ట్రానికి వచ్చే ఆదాయం, ప్రజా ఆస్తుల రక్షణ వంటి అంశాలే అసలు ప్రగతికి కొలమానాలుగా చూడాలని. అందుకే చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని ఒప్పందాలపై సమగ్ర పారదర్శకత, పరిశీలన, ప్రజలకు అందుబాటులో ఉండే వాస్తవ గణాంకాలు అవసరమనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.






