ప్రజాస్వామ్య వ్యవస్థలో (Democratic System) మీడియాను నాలుగో స్తంభంగా అభివర్ణిస్తారు. అయితే, ఈ వ్యవస్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను తుంగలో తొక్కినప్పుడు, అది కేవలం ఒక పార్టీ ప్రచార యంత్రంగా మారిపోతుంది. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ పరిణామాలను గమనిస్తే, నిరాధారమైన ఆరోపణలను కనీస విచక్షణ లేకుండా ప్రసారం చేయడం వల్ల అనేక మీడియా సంస్థలు (Media Organizations) ప్రజల్లో తమ విశ్వసనీయత (Credibility) కొల్పోతున్నాయి. పనికట్టుకుని దురుద్దేశంతో వ్యవస్థలను తప్పుదోవ పట్టించేలా సాగుతున్న ఈ టార్గెటెడ్ మీడియా ట్రైల్స్, న్యాయస్థానాల తీర్పుల ముందు పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ ప్రేరేపిత మీడియా కథనాలకు, న్యాయస్థానాలు వెలికితీసిన నిష్ఠుర సత్యాలకు మధ్య ఉన్న వెత్యాసాన్ని గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒక క్రిమినల్ నేరారోపణను (Criminal Allegation) రాజకీయ అస్త్రంగా మార్చుకుని, వ్యవస్థలపై దాడి చేయడం వెనుక ఉన్న వ్యూహం అత్యంత ప్రమాదకరమైనది. దీనికి నిలువెత్తు సాక్ష్యం జత్వానీ కేసు. కాదంబరి జత్వానీ (Kadambari Jethwani) అనే మహిళను తొలుత ఒక బాధితురాలిగా చిత్రించి, గత వైయస్సార్సీపి(YSRCP) ప్రభుత్వం ఆమెను వేధించిందని టీడీపీ(TDP), జనసేన(Jana Sena) కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీనిని ప్రాతిపదికగా చేసుకుని ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారులైన పీఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, హనుమంతరావులపై కేసులు నమోదు చేసి వారిని సస్పెండ్ చేశారు. అయితే, సీఐడీ (CID) దాఖలు చేసిన అభియోగపత్రం ఈ ప్రచారంలోని అసలు రంగును బయటపెట్టింది. జత్వానీ బాధితురాలు కాదు, ఆమె ఒక ప్రొఫెషనల్ బ్లాక్ మెయిలర్ అని దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. ఆమె కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తిని బెదిరించి సుమారు రూ. 1.31 కోట్లు వసూలు చేసినట్లు బ్యాంక్ లావాదేవీలు మరియు సాంకేతిక ఆధారాలతో నిరూపితమైంది. రాజకీయ లబ్ధి కోసం ఒక నిందితురాలిని బాధితురాలిగా చూపి, విచారణ జరగకుండానే మీడియా ద్వారా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం జర్నలిజం దిగజారిన విలువలకి పరాకాష్ట. ఈ కేసు విచారణలో వెల్లడైన నిజాలు మీడియా వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తిచూపాయి.
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం (Tirumala Laddu Controversy) కూడా మరో కేసుగా చూడాలి. భక్తుల మనోభావాలతో చెలగాటం అత్యంత ప్రమాధకరం. మతపరమైన విశ్వాసాలను రాజకీయ ఆరోపణలతో ముడిపెట్టడం సామాజిక విచ్ఛిన్నానికి దారితీస్తుంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ వాడారంటూ సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచాయి. తగిన ఆధారాలు లేకుండా ఒక పవిత్రమైన వ్యవస్థపై ఇటువంటి ఆరోపణలు చేయడం వెనుక ఉన్న రాజకీయ దురుద్దేశాలను మీడియా ప్రశ్నించకపోగా, ఆ విష ప్రచారానికి వేదికగా మారింది. ఈ వివాదంపై స్పందించిన సుప్రీం కోర్టు(Supreme Court), వాస్తవాలను నిర్ధారించే బాధ్యతను సీబీఐకి(CBI) అప్పగించింది. సీబీఐ సమర్పించిన నివేదికలో పరీక్షా ఫలితాలను విశ్లేషించిన అత్యున్నత న్యాయస్థానం, లడ్డూల్లో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని నిర్ధారించింది. రాజకీయ ప్రయోజనాల కోసం దైవకార్యాలను కూడా అపవిత్రం చేసేలా సాగిన ఈ ప్రచారం, చివరకు న్యాయస్థానం ముందు వీగిపోయింది. ఆ వార్తలను ధృవీకరించకుండా మోసిన మీడియా సంస్థల నైతికతను సీబీఐ నివేదిక ప్రశ్నార్థకం చేసింది.
అలాగే అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలను మాదక ద్రవ్యాల అక్రమ రవాణాగా చిత్రించడం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే చర్య. 2024 ఎన్నికలకు ముందు బ్రెజిల్ నుండి వచ్చిన కంటైనర్‌లో ఏకంగా 25,000 టన్నుల డ్రగ్స్ ఉన్నాయని, దానికి నాటి ముఖ్యామంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి (YS Jagan Mohan Reddy) అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని టీడీపీ అసంబద్ధమైన ఆరోపణలు చేసింది. 25,000 టన్నుల డ్రగ్స్ సరఫరా చేయగలరా అనే ఆలోచన కూడా లేకుండా మీడియా ఈ కట్టుకథను తీవ్ర స్థాయిలో ప్రచారం చేసింది. అయితే ఈ వ్యవహారంపై సుదీర్ఘ దర్యాప్తు జరిపిన సీబీఐ, చివరకు అది కేవలం “డ్రై ఈస్ట్”(Dry Yeast) అని, అందులో ఎటువంటి డ్రగ్స్ లేవని విశాఖపట్నం కోర్టుకు తుది నివేదిక సమర్పించింది. కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్ కూడా ఆ కంటైనర్లను విడిచిపెట్టినట్లు ధృవీకరించారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర పారిశ్రామిక మరియు వాణిజ్య ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో పణంగా పెట్టే ఇటువంటి ప్రచారాలు, మీడియా బాధ్యతారాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చాయి.
మరో ఘటన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఒక నేర దర్యాప్తును రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి ఎలా వాడుకోవచ్చో ఈ కేసు ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ హత్యతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మరియు ఆయన సతీమణి వైఎస్ భారతికి (YS Bharathi) సంబంధం ఉందంటూ మీడియాలో నిరంతరం విష ప్రచారం జరిగింది. ముఖ్యంగా టైం లైన్ విషయంలో తలెత్తిన సాంకేతిక అంశాలను మీడియా వక్రీకరించింది. అంతర్జాతీయ ప్రామాణిక కాలం (యూటీసీ) భారత ప్రామాణిక కాలం (ఐ.ఎస్.టీ) మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తప్పుగా చూపి, మరణవార్త ముందుగానే జగన్ కు ఆయన సతీమణికి తెలుసన్న భ్రమను కల్పించారు. అయితే, సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ద్వారా ఈ ప్రచారంలోని డొల్లతనం బయటపడింది. ఆ సాంకేతిక వ్యత్యాసమే తప్ప, వారికి ఈ హత్యతో ఎటువంటి సంబంధం లేదని సీబీఐ స్పష్టంగా నిగ్గుతేల్చింది. దర్యాప్తు సంస్థల నివేదికలు రాకముందే మీడియా వెలువరించిన ఏకపక్ష తీర్పులు బాధ్యతాయుతమైన జర్నలిజం కాదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమని నిరూపితమైంది.
రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కేసులే కాకుండా అంతర్జాతీయ కేసుల్లో సైతం మీడియా ట్రైల్స్ నిర్వహించేశాయి మన మీడియా సంస్థలు. రాష్ట్రానికి భారీగా లాభం చేకూర్చే ఆర్థిక ఒప్పందాలను అవినీతిగా చిత్రించడం వెనుక ఉన్న కుట్రను అంతర్జాతీయ తీర్పులు ఎండగట్టాయి. అదానీ గ్రీన్ సంస్థతో యూనిట్ కు రూ. 2.49 చొప్పున కుదుర్చుకున్న ఒప్పందం ఆంధ్రప్రదేశ్ కు పాతికేళ్లలో సుమారు రూ. 1.10 లక్షల కోట్ల లాభం చేకూరుస్తుందని నాటి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఆదానిపై అంతర్జాతీయ స్థాయిలో ఆరోపణలు రావడంతో కూటమి అనుకూల మీడియా సెకీ ఒప్పందాన్ని అనుకూలంగా మల్చుకుంది. అయితే ఈ కేసును విచారించిన న్యూయార్క్ ఫెడరల్ కోర్టు గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై ఉన్న క్రిమినల్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ కేసును శాశ్వతంగా కొట్టివేశారు. అదానీపై క్రిమినల్ ఛార్జీలు శాశ్వతంగా తొలగిపోవడంతో, జగన్ ప్రభుత్వంపై జరిగిన ప్రచారం నిరాధారమని తేలిపోయింది. అంతర్జాతీయ వేదికలపై కూడా అసత్యాలు వీడి వాస్తవాలు గెలిచిన తీరు మీడియాకు దిగజారుడు తనాన్ని బయటపెట్టింది.
రాజకీయ పార్టీలు అల్లే కట్టుకథలను గుడ్డిగా నమ్మడం, విశ్లేషించకుండా ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయడం వల్ల మీడియా తన ప్రాధమిక లక్షణమైన ‘విశ్వసనీయత’ను కోల్పోతోందని. పైన పేర్కొన్న ప్రతి కేసులోనూ న్యాయస్థానాల తీర్పులు మీడియాకు ఒక కనువిప్పు కావాలని. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను తప్పుదోవ పట్టించే ప్రచారాలకు వార్తా సంస్థలు వేదిక కాకూడదని. ఫ్యాక్ట్-చెకింగ్, నైతిక విలువలతో కూడిన జర్నలిజం మాత్రమే సమాజంలో మీడియా గౌరవాన్ని కాపాడగలవని. కేవలం ఆరోపణల ఆధారంగా కాకుండా, వాస్తవాల ఆధారంగానే వార్తా కథనాలు ఉండాలని, లేనిపక్షంలో ప్రజల ముందు మీడియా తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోక తప్పదని. వాస్తవమే జర్నలిజం యొక్క అంతిమ విజయం కావాలని. పౌర సంఘాలనుండి వినిపిస్తున్న మాట.






