ఢిల్లీలో(Delhi) ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేశ రాజధానిలోని నైరుతి ప్రాంతం సత్య నికేతన్‌లో(Satya Niketan) 4 అంతస్తుల భవనం (Building)ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు 2 మందిని సురక్షితంగా బయటకు తీసినట్లు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) అనిల్ శర్మ(Anil Sharma) తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కూలిపోయిన భవనంలో పీజీ వసతి గృహం ఉన్నట్లు సమాచారం. సత్య నికేతన్ ప్రాంతం ఢిల్లీ విశ్వవిద్యాలయం(Delhi University) దక్షిణ ప్రాంగణానికి సమీపంలో ఉండటంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో విద్యార్థులు నివసిస్తుంటారు.
భవనం కూలిపోయే సమయంలో లోపల సుమారు 50 మంది విద్యార్థులు ఉండి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో ఎక్కువ మంది విద్యార్థులు(Students) వసతి గృహంలోనే ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు జేసీబీలతో (JCB Machines) పాటు 12 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. శిథిలాల కింద నుంచి బాధితుల కేకలు వినిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొందరు విద్యార్థులు శిథిలాల కింద నుంచి ఫోన్ ద్వారా సహాయం కోరుతున్నట్లు సమాచారం అందిందని ఎమ్మెల్యే అనిల్ శర్మ వెల్లడించారు.
భవనం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అధికారులు సహాయక, రక్షణ చర్యలపైనే పూర్తిగా దృష్టి సారించారు. శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.








