ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ (IAS) అధికారిణి దివ్యా మిత్తల్ (Divya Mittal) 13 ఏళ్ల సివిల్ సర్వీసెస్‌కు రాజీనామా (Resignation) చేసి త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు. అయితే ఏ రాజకీయ పార్టీలోనూ చేరకుండా ప్రజలతో కలిసి కొత్త రాజకీయ వేదికను నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపారు.
వ్యక్తిగత, కుటుంబ కారణాలతో ఆగస్టు 30, 2026న రాజీనామా చేసిన ఆమె.. సెప్టెంబర్ 15 నుంచి అది అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యేందుకు కొంత సమయం పట్టిందని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ ప్రజలు తనను కూతురిలా ఆదరించారని, అందుకే తన రాజకీయ ప్రయాణాన్ని కూడా అక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు దివ్యా మిత్తల్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎవరో వస్తారని ఎదురుచూడకుండా, మార్పు కోసం తామే ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రాజకీయాలు తనకు పదవి కోసం చేసే ప్రయత్నం కాదని, ప్రభుత్వ కార్యాలయాలకు (Government Offices) వెళ్లలేని సామాన్యుల గొంతుకగా నిలవడమే లక్ష్యమని చెప్పారు.
మిర్జాపూర్‌లో ఓ మహిళ (Woman) తన పిల్లల కోసం పాఠశాలను ఉన్నత స్థాయికి పెంచాలని కోరిన ఘటనను దివ్యా మిత్తల్ గుర్తుచేసుకున్నారు. అనుమతి లభించినా మూడేళ్లపాటు నిర్మాణం ప్రారంభం కాకపోవడం అధికార వ్యవస్థలోని లోపాలను చూపించిందన్నారు.
అలాగే భూమి (Land) మంజూరైనా హక్కు పొందలేక ఇబ్బంది పడిన ఓ నిరుపేద వ్యక్తి ఘటనను ప్రస్తావించారు. అధికారుల సమన్వయ లోపం, అనవసరమైన అనుమతుల కారణంగా సామాన్యులు (Common People) తమ హక్కుల కోసం తిరగాల్సి వస్తోందని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు(Roads), వంతెనల కొరత(Bridges), రోడ్లపై గుంతలు(Potholes), విద్యా వ్యవస్థలో (Education System) లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై (Question Paper Leaks) ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు కారణంగా ఉద్యోగ రంగంలో వచ్చే మార్పులపై కూడా చర్చ అవసరమని అన్నారు.
ఇద్దరు కుమార్తెల తల్లిగా భావి తరాల భవిష్యత్తుపై ఆలోచించడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు దివ్యా మిత్తల్ తెలిపారు. కేవలం నాయకులను మార్చడం కాకుండా రాజకీయాల తీరులో మార్పు తీసుకురావడమే తన లక్ష్యమన్నారు.
సదుద్దేశం, న్యాయం, బాధ్యత, సానుకూల ఆలోచనతో ముందుకు సాగుతానని చెప్పారు. సోషల్ మీడియాలో తనపై జరిగిన ట్రోలింగ్, బెదిరింపులకు భయపడబోనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో డబ్బు, కండబలం, కుల రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఐఏఎస్‌గా పనిచేసినట్లే కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని దివ్యా మిత్తల్ వెల్లడించారు.








