ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయ చరిత్రలో (History) మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి (వైఎస్ఆర్) (Dr. Y. S. Rajasekhara Reddy – YSR) పాలన ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది. 2004 నుంచి 2009 వరకు సాగిన ఆయన ఐదేళ్ల మూడు నెలల పాలన కేవలం పరిపాలనకే పరిమితం కాలేదు. పేద(Poor), బడుగు(Downtrodden), బలహీన వర్గాల (Weaker Sections) జీవితాల్లో వెలుగులు నింపిన సంక్షేమ పాలనగా గుర్తింపు పొందింది. సంక్షేమం(Welfare), అభివృద్ధి(Development) అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని ఆయన సంపాదించారు.
అణగారిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి పథకాన్ని రూపకల్పన చేసిన వైఎస్ఆర్(YSR), అర్హులైన ప్రతి ఒక్కరికీ కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ (Rajiv Aarogyasri)పథకం ఆయన పాలనలోనే ప్రారంభమైంది. దాదాపు 942 రకాల వ్యాధులకు రూ.2 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఈ పథకం లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించింది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే 108 అంబులెన్స్ సేవలు, గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను చేరవేసే 104 మొబైల్ వైద్య సేవలు ప్రజారోగ్య రంగంలో కొత్త దిశను చూపాయి.
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా సుమారు 33 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందారు. నేటికీ ఈ పథకాల ప్రాముఖ్యత కొనసాగుతుండటం వాటి ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
సుమారు రెండు కోట్ల తెల్ల రేషన్ కార్డు దారులకు (White Ration Card Holders) రూ.2కే కిలో బియ్యం అందిస్తూ పేదల ఆహార భద్రతను బలోపేతం చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందించే పింఛన్లను పెంచడమే కాకుండా, లబ్ధిదారుల సంఖ్యను సుమారు 16 లక్షల నుంచి 71 లక్షలకు పెంచి సామాజిక భద్రతను మరింత విస్తరించారించిన ఘనత ఆయనకే దక్కుతుంది.
తనను తాను రైతు పక్షపాతిగా నిరూపించుకున్న వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ (Free Electricity) అందించే ఫైలుపైనే కావడం విశేషం. దాదాపు 64 లక్షల మంది రైతులకు రూ.11,100 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయడంతో పాటు, సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు రూ.1,600 కోట్ల ప్రోత్సాహకాన్ని అందించారు. చరిత్రలో రైతులకి ఈ స్థాయిలో మేలు చేసిన నాయకుడు లేరని నేటికీ చెప్పుకునే మాట. అలాగే రూ.1,259 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేసి, సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంపు ద్వారా రైతులకు గిట్టుబాటు ధర (Remunerative Price) కల్పించే ప్రయత్నం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలోని కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో జలయజ్ఞం (Jalayagnam Irrigation Initiative) పేరుతో రూ.1.76 లక్షల కోట్ల వ్యయంతో 81 సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించారు. పోలవరం(Polavaram), పులిచింతల (Pulichintala), ప్రాణహిత-చేవెళ్ల వంటి (Pranahita-Chevella Project) భారీ ప్రాజెక్టులు ఆయన దూరదృష్టికి నిదర్శనాలుగా నిలిచాయని చెప్పడంలో సందేహం లేదు. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాలకు పావలా వడ్డీ (Pavala Vaddi) పథకం ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందించి ఆర్థిక స్వావలంబనకు మార్గం సుగమం చేశారు. అభయహస్తం పథకం ద్వారా మహిళలకు వృద్ధాప్య భద్రత, బీమా సౌకర్యాలు కల్పించారు.
ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు అనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme) కింద ఐదేళ్లలో 47 లక్షలకు పైగా గృహాలను నిర్మించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అనే లక్ష్యంతో 18 కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయగా, గ్రామీణ ప్రతిభావంతుల కోసం మూడు ఐఐఐటీలను (IIITs) స్థాపించారు. రాష్ట్ర ఐటీ ఎగుమతులను రూ.5,000 కోట్ల స్థాయి నుంచి రూ.32,500 కోట్లకు పెంచి ఐటీ రంగ అభివృద్ధికి బాటలు వేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్(Hyderabad Outer Ring Road), శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport, Shamshabad) వంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు కూడా ఆయన పాలనలోనే పూర్తయ్యాయి.
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాలన ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వాటికి దీర్ఘకాలిక పరిష్కారాలను చూపించిన ప్రజా సంక్షేమ పాలనగా చరిత్రలో నిలిచిపోయింది. ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలు నేటికీ దేశంలోని పలు రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ విధానాలకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి.
ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆలోచనలు, సంక్షేమ దృక్పథం, ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులు ఆయనను కోట్లాది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెట్టాయని ఆయన పాలనలో లబ్దిపోందిన ప్రతి ఒక్కరు నేటికి చెప్పే మాట. నేడు ఆ మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి (YSR Birth Anniversary) సందర్భంగా ఆయనకు ఘన నివాళులు.






