భారతీయ సినీ రంగంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు కొత్త దారి చూపిన చిత్రం దృశ్యం. కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ సాధారణ వ్యక్తి ఆడే తెలివైన మైండ్ గేమ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మలయాళంలో మోహన్ లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా తర్వాత తెలుగు, హిందీ, తమిళం సహా పలు భాషల్లో రీమేక్ అయి ఘన విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు ఈ విజయవంతమైన సిరీస్‌లో మూడో భాగం దృశ్యం 3 రాబోతుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సంచలన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
మలయాళ చిత్రరంగంలో అరుదైన రికార్డు
దృశ్యం 3 (Drishyam 3) సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ (Panorama Studios) ఏకంగా రూ.100 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టినట్లు సమాచారం. పనోరమా స్టూడియోస్ ద్వారా ఆశీర్వాద్ సినిమాస్‌తో ఈ భారీ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
సాధారణంగా మలయాళ సినిమాల మార్కెట్ ఇతర భాషలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. అలాంటి పరిస్థితిలో విడుదలకు ముందే ఓ మలయాళ చిత్రానికి రూ.100 కోట్ల పెట్టుబడి రావడం అరుదైన రికార్డుగా భావిస్తున్నారు.
ఈ స్థాయి పెట్టుబడికి ప్రధాన కారణం జార్జ్ కుట్టి పాత్రకు దేశవ్యాప్తంగా ఉన్న ఆదరణ. అలాగే దర్శకుడు జీతూ జోసెఫ్ కథనం, స్క్రీన్ ప్లేపై ఉన్న నమ్మకం కూడా ముఖ్య కారణంగా చెబుతున్నారు.
దృశ్యం మొదటి 2 భాగాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం కారణంగా మూడో భాగంపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈసారి జార్జ్ కుట్టి ఎలా తప్పించుకుంటాడు, ఎలాంటి మైండ్ గేమ్ ఆడబోతున్నాడు అనే ఉత్కంఠ అందరిలో ఉంది.
ఈ భారీ డీల్‌తో దృశ్యం 3 కేవలం ప్రాంతీయ చిత్రంగా కాకుండా దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రేజీ థ్రిల్లర్ మే 21న థియేటర్లలో విడుదల కానుంది.






