డీఎస్సీ(DSC) నిర్వహణలో అక్రమాలు, అవకతవకల ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ.. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల (APPSC Group-1 Recruitments) అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో డీఎస్సీ వైఫల్యాలపై చర్చ జరగకుండా ‘డైవర్షన్ పాలిటిక్స్’కు (Diversion Politics) ప్రభుత్వం పాల్పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 163 మంది ప్రతిభావంతులైన గ్రూప్-1 అధికారుల భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం బలిపీఠం ఎక్కిస్తున్నారనే చర్చకు ఈ పరిణామాలు దారితీశాయి.
ఆధునిక పోటీ పరీక్షల్లో డిజిటల్ మూల్యాంకనం పారదర్శకత, వేగం, మానవ తప్పిదాల నియంత్రణ కోసం అనుసరిస్తున్న విధానమే. 2018 గ్రూప్-1 నియామకాల్లో ఏపీపీఎస్సీ అనుసరించిన డిజిటల్ మూల్యాంకన విధానాన్ని హైకోర్టు (High Court) తప్పుబట్టలేదని, అయితే ఆ విధానం 2018 నోటిఫికేషన్లో ముందుగా పేర్కొనలేదనే ప్రొసీజరల్ అంశం కారణంగా నియామక ప్రక్రియపై స్టే విధించిందనే వాదన ఉంది. ఈ సాంకేతిక అంశాన్ని ఆధారంగా చేసుకుని మొత్తం నియామక ప్రక్రియనే అక్రమంగా చిత్రీకరించడం సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హాయ్‌ల్యాండ్‌లో (Hyderabad Highland) 84 రోజుల పాటు జవాబు పత్రాలు భద్రపరచడం కూడా అక్రమానికి సంకేతం కాదని, బబ్లింగ్(Bubbling), ట్యాబులేషన్ (Tabulation) వంటి ప్రక్రియల కోసం ఏర్పడిన లాజిస్టికల్ అవసరమని చెబుతున్నారు. 452 మంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు మూల్యాంకనం పూర్తి చేసిన అనంతరం, డిజిటల్ మార్కులను భౌతిక ఓఎంఆర్ స్లిప్పుల్లో నమోదు చేసేందుకు 66 మంది టెక్నికల్ అసిస్టెంట్లను వినియోగించారని పేర్కొంటున్నారు. దేశంలోని ఏడు ప్రముఖ సీఎఫ్ఎస్ఎల్ కేంద్రాల ఫోరెన్సిక్ పరిశీలనలో ప్రధాన జవాబు పత్రాలు ‘ఇంటాక్ట్’గా (Intact) ఉన్నట్లు నిర్ధారణ అయిందనే వాదన కూడా ఉంది.
మార్కుల సవరణల విషయంలోనూ ‘ఎగ్జామినర్–చీఫ్ ఎగ్జామినర్–స్క్రూటినైజర్’(Examiner–Chief Examiner–Scrutinizer) అనే మూడు అంచెల మూల్యాంకన వ్యవస్థలో భాగంగానే పొరపాట్లను సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతుందని చెబుతున్నారు. సిట్ నివేదికలో ప్రస్తావించిన 718 మార్పులు, వైట్ ఫ్లూయిడ్ వినియోగం వంటి అంశాలను ఫోర్జరీగా కాకుండా అధికారిక సవరణలుగా పరిగణించాలని, స్వయంగా ఎగ్జామినర్లే సిట్ విచారణలో ఆ సవరణలు తామే చేసినట్లు అంగీకరించారని. ఇలాంటి సాధారణ “నార్మలైజేషన్”(Normalization Process) ప్రక్రియను అక్రమంగా చిత్రీకరించడం వ్యవస్థను భ్రష్టు పట్టించడమే అవుతుందనే వాదనలు ఉన్నాయి. అలాగే ఈ మార్పుల వల్ల తుది ఫలితాల్లో ప్రభావం లేదనే అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
మరోవైపు 2018 గ్రూప్-1 ద్వారా ఎంపికైన అభ్యర్థుల విద్యా నేపథ్యం కూడా చర్చనీయాంశమైంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, వైద్య వృత్తి, యూపీఎస్సీ వంటి అత్యంత ప్రతిష్టాత్మక విద్యా, పోటీ పరీక్షల నుంచి వచ్చిన అభ్యర్థులు ఈ బ్యాచ్‌లో ఉన్నారని పేర్కొంటున్నారు. ఐఐటీ నుంచి 19 మంది, ఎన్ఐటీ నుంచి 17 మంది, ఐఐఎం నుంచి 6 మంది, మెడికల్ ప్రొఫెషనల్స్ 18 మంది, యూపీఎస్సీ విజేతలు 16 మంది ఉన్నారని చెబుతున్నారు. ఇలాంటి ప్రతిభావంతుల నియామకాలపై ఆధారాలు తేలకముందే అనుమానాల ముసుగులో బురదజల్లడం వారి ప్రతిభను అవమానించడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ వంటి సాంకేతిక సంస్కరణలు ప్రవేశపెట్టారని, గ్రూప్-1 ఇంటర్వ్యూ బోర్డుల్లో విద్యావేత్తలు, సీనియర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను నియమించారని గుర్తుచేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థలో జరిగిన నియామకాలను పూర్తిగా అవినీతి లేదా అక్రమాలుగా ముద్ర వేయడం ద్వారా వ్యవస్థపై పనిచేసిన అధికారుల విశ్వసనీయతపైనా ప్రశ్నలు తలెత్తుతాయని అంటున్నారు.
ప్రస్తుత ప్రభుత్వ వైఖరిలోనూ వైరుధ్యం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2018 గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని చెబుతున్న ప్రభుత్వం, అదే బ్యాచ్‌కు చెందిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తోందని ప్రశ్నిస్తున్నారు. కుప్పం డెవలప్మెంట్ అథారిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా అదే బ్యాచ్‌కు చెందిన అధికారులకు బాధ్యతలు అప్పగిస్తే, నియామకాలు అక్రమమనే వాదనకు ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఏమిటనే ప్రశ్న ముందుకొస్తోంది.
డీఎస్సీ వైఫల్యాలపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు గ్రూప్-1 అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవద్దని విమర్శకులు సూచిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, మూల్యాంకన విధానాలు, పరిపాలనా ప్రక్రియలు, అభ్యర్థుల ప్రతిభ వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలకు రావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్టను దెబ్బతీయడం వల్ల నిరుద్యోగ యువతలో నమ్మకం మరింత దెబ్బతింటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవస్థల విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






