---Advertisement---

కూటమి పాలనలో భయపెడుతున్న ‘మద్యం’!

May 11, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం, అక్రమ బెల్ట్‌ షాపులు, అనుమానాస్పద మరణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అక్రమ లాభాల కోసం నకిలీ మద్యం వ్యాపారం పెరిగిపోయిందనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. విశాఖ పరవాడ, జంగారెడ్డిగూడెం, చిత్తూరు, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై వచ్చిన వార్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించిన విషయం విదితమే..

కొలికపూడి శ్రీనివాస్ రావు లాంటి కూటమి నాయకులే బెల్ట్‌ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయని బహిరంగంగానే ఒప్పుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. రాజమండ్రి వంటి ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు వాటాల పంపకాలపై మాట్లాడిన ఆడియోలు బయటకు రావడం కూడా వివాదానికి మరింత బలం చేకూర్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో మద్యం సేవించిన అనంతరం ఇద్దరు స్నేహితులు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతులు ఎల్లారెడ్డి అలియాస్‌ పుల్లారెడ్డి (62), అంజిరెడ్డి (61)గా గుర్తించారు. బెల్ట్‌ షాపులో కొనుగోలు చేసిన మద్యం తాగిన తర్వాతే వీరు అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇది ఒక్క ఘటన మాత్రమే కాదు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మద్యం సేవించిన తర్వాత అకస్మాత్తుగా మరణించిన ఘటనలు వరుసగా నమోదవుతున్నాయి. గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, ఏలూరు, చిత్తూరు, అనంతపురం, తిరుపతి వంటి ప్రాంతాల్లో మద్యం సేవించిన తర్వాత కుప్పకూలి మరణించిన ఘటనలు ప్రజల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. కొందరు వాంతులు, కడుపునొప్పితో మరణించగా, మరికొందరు మద్యం సేవించిన చోటే ప్రాణాలు కోల్పోయారు.

ఈ వరుస ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ మద్యం మాఫియా, బెల్ట్‌ షాపుల అక్రమ వ్యాపారం, అధికారపార్టీ నేతల ప్రమేయం వంటి అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మద్యం సేవించి చనిపోయిన ప్రతి ఘటనపై ఫోరెన్సిక్‌ విచారణ జరిపి అసలు కారణాలు బయటపెట్టాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment