శిశు ఆహార ఉత్పత్తుల (Infant Food Products) విషయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో నెస్లే ఇండియాకు (Nestle India) భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) నోటీసులు (Notices) జారీ చేసినట్లు సమాచారం. పసిపిల్లల కోసం నెస్లే తయారు చేస్తున్న 3 పోషకాహార ఉత్పత్తుల ప్రచారాలు, నాణ్యత ప్రమాణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ-కామర్స్ వేదికలపై (E-commerce Platforms) నాన్ ఎక్సెల్లా ప్రో స్టేజ్ 1 (NAN EXCELLA PRO Stage 1) ఉత్పత్తికి సంబంధించి 5 హెచ్‌ఎంవోలు(5 HMOs), వెయ్ ప్రోటీన్ వంటి అంశాలను ప్రచారం చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తించింది. అలాగే లాక్టోజెన్ ప్రో 1లోని (Lactogen Pro 1) వెయ్ ప్రోటీన్ సులభంగా జీర్ణమవుతుందని ప్రచారం చేసినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీనిపై సంస్థను వివరణ కోరగా, సమాధానంపై అధికారులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది.
మరోవైపు నెస్లేకు చెందిన ఒక ఫాలో-అప్ ఫార్ములా నమూనాలో బయోటిన్ (Biotin) లేదా విటమిన్ బి7 (Vitamin B7) పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేదని ప్రయోగశాల పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం. రెఫరల్ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లోనూ ఇదే విషయం నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.
పసిపిల్లల ఆహార ఉత్పత్తుల (Infant Food Products) ప్రకటనలు, ప్రచారాలపై భారత్‌లో కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. 1992 నాటి ఇన్ఫాంట్ మిల్క్ సబ్‌స్టిట్యూట్స్ చట్టం (Infant Milk Substitutes Act) ప్రకారం పలు పరిమితులు ఉన్నాయి. మొత్తంగా నెస్లే ఇండియాపై 3 కేసులు నమోదైనట్లు సమాచారం. వీటిలో 2 ప్రచారాలకు సంబంధించినవి కాగా, మరో కేసు పోషక పదార్థం పరిమాణానికి సంబంధించినది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ విచారణ పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం వెలువడనుంది.








