ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మరోసారి పోలీసు వ్యవస్థ (Police System) పనితీరుపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తన కుమారుడు వీరేంద్ర (Veerendra) కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించిన దళిత మహిళ (Dalit Woman) మాల గంగమ్మ (Mala Gangamma) కథ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో గంగమ్మ హైకోర్టును (High Court) ఆశ్రయించగా, అనంతరం జరిగిన పరిణామాలు మరింత వివాదాస్పదంగా మారాయి.
పోలీసులే గంగమ్మను విచారణ పేరుతో కస్టడీలోకి (Custody) తీసుకుని గంగమ్మ తీవ్ర చిత్రహింసలకు గురిచేసేసరికి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈ ఘటన సాధారణ మరణమా, లేక లాకప్‌డెత్‌నా (Lock-up Death) అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గంగమ్మ మృతి కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో వివరించాలని పోలీసులను ఆదేశించిన ధర్మాసనం, పోస్టుమార్టం నివేదికతో సహా అన్ని రికార్డులను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. అలాగే గంగమ్మ కుమార్తె లక్ష్మికి (Lakshmi) భద్రత కల్పించాలని ఆదేశించింది.
విచారణ సందర్భంగా గంగమ్మ మరణానికి గల కారణాలపై కోర్టు ప్రశ్నించగా, పోలీసుల తరఫు న్యాయవాది ఆమె కార్డియాక్ అరెస్ట్‌తో (Cardiac Arrest) పాటు ఇతర కారణాల వల్ల మరణించిందని తెలిపారు. అయితే గంగమ్మ కుటుంబం తరఫు న్యాయవాదులు పోస్టుమార్టం నివేదికను తారుమారు చేశారని, నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
గత ఏడాది హైకోర్టు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ(SP) నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT) ఏర్పాటు చేయబడింది. వీరేంద్ర ఆచూకీ కోసం చేపట్టిన విచారణలో గంగమ్మ, దర్గప్పలను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గంగమ్మ మృతి చెందగా, దర్గప్ప తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దర్గప్ప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో, కీలక సాక్ష్యాలు వెలుగులోకి రాకముందే ఈ వ్యవహారం మరుగునపడే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతని వాంగ్మూలాన్ని వెంటనే నమోదు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం కూడా దాఖలైంది.
కొడుకు ఆచూకీ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఓ తల్లి చివరకు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయిందనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.






