అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharama Raju District) జీకే వీధి మండలం (GK Veedhi Mandal) ధారకొండ పంచాయతీ పరిధిలోని గంగవరం తాత్కాలిక వంతెన (Gangavaram Temporary Bridge) ప్రతి వర్షాకాలంలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోతున్నా శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో(Heavy Rains) వాగులు పొంగిపొర్లడంతో గంగవరం రహదారిలోని మార్గం మరోసారి ధ్వంసమై రవాణా వ్యవస్థ(Transport System) స్తంభించింది.
శాశ్వత వంతెన (Permanent Bridge) నిర్మించకుండా అధికారులు ప్రతిసారీ తూములు, తాత్కాలిక డైవర్షన్ రహదారులతోనే సరిపెడుతున్నారని స్థానిక గిరిజనులు (Local Tribal People) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతో గతంలోనూ గిరిజనులే స్వయంగా తాత్కాలిక వంతెనలు నిర్మించుకున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఆ నిర్మాణం కూడా వరదకు కొట్టుకుపోవడంతో, అధికారుల కోసం ఎదురుచూడకుండా మళ్లీ తామే వంతెన నిర్మించుకునేందుకు గ్రామస్థులు ముందుకొచ్చారు.
వంతెన ధ్వంసం కావడంతో ఆంధ్రప్రదేశ్–ఒడిశా(Andhra Pradesh-Odisha) సరిహద్దు ప్రాంతాల్లోని 15కి పైగా గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో రాకపోకలు తెగిపోయాయి. నిత్యావసర సరుకుల సరఫరాతో పాటు గర్భిణులు, రోగులు అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రులకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వారు విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన Pradhan Mantri Gram Sadak Yojana – PMGSY) కింద నిధులు మంజూరు చేసి గంగవరం వంతెనను యుద్ధప్రాతిపదికన శాశ్వతంగా నిర్మించాలని గిరిజన సంఘాలు, స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.





