జర్మనీలోని (Germany) బోచుమ్ (Bochum) నగరంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో కేరళకు (Kerala) చెందిన ముగ్గురు భారతీయులు (Indians) ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తొలుత ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఉంటాయని భావించిన పోలీసులు, ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టి ఉండవచ్చనే అనుమానంతో దర్యాప్తు చేపట్టారు.
బోచుమ్ నగరంలోని ఓ నివాస భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, అప్పటికే భవనంలో చిక్కుకున్న ముగ్గురు భారతీయులు మృత్యువాత పడ్డారు.
మృతులను కేరళకు చెందిన అంజలి షీలా జాయ్ (Anjali Sheela Joy) (25), నోవా సాబు (Nova Sabu) (27), సావిన్ జానీ (Savin Jani) (26)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో భవనానికి ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అదే భవనంలో నివసిస్తున్న రొమేనియా (Romania) దేశానికి చెందిన వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం వెనుక అసలు కారణమేంటి? మంటలు ప్రమాదవశాత్తు చెలరేగాయా, లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








