ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సీట్ల పంపకం(Seat Sharing) జనసేన పార్టీలో(Jana Sena Party) తీవ్ర అసంతృప్తికి దారితీస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కూటమిలో భాగంగా జనసేనకు 40 శాతం సీట్లు దక్కుతాయని ప్రచారం చేసినప్పటికీ, చివరకు కేటాయించిన స్థానాలపై ఆ పార్టీ క్యాడర్లో నిరాశ వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో పలువురు జనసేన అభిమానులు, కార్యకర్తలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లు(Municipal Corporations), 106 మున్సిపాలిటీలు(Municipalities), నగర పంచాయతీలకు(Nagar Panchayats) సంబంధించి మొత్తం 123 స్థానాల్లో టీడీపీకి(TDP) 89, జనసేనకు(Jana Sena) 25, బీజేపీకి(BJP) 9 స్థానాలు కేటాయించి జనసేనకు శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లతో పాటు 21 మున్సిపాలిటీలు కేటాయించారు. అయితే, ఈ కేటాయింపుల్లోనూ జనసేనకు పూర్తి స్థాయిలో అవకాశం దక్కడం లేదని ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
జనసేనకు కేటాయించిన నాలుగు కార్పొరేషన్లలో శ్రీకాకుళం, కాకినాడ ఎన్నికలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. ఏలూరు, విజయవాడలో మాత్రమే ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. విజయవాడలో టీడీపీ నుంచి రాధా (Radha) పేరు తెరపైకి రావడం, ఏలూరులో జనసేన తరఫున రెడ్డి అప్పలనాయుడు (Reddy Appala Naidu) పేరు వినిపిస్తుండటంతో, నాలుగు కార్పొరేషన్లు దక్కాయన్న ప్రచారానికి వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. 40 శాతం వాటా అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రచారం చేయించినప్పటికీ, చివరకు సీట్ల పంపకం విషయంలో జనసేనకు ఆశించిన ప్రాధాన్యం దక్కలేదని కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జనసేనకు కేటాయించిన 21 మున్సిపాలిటీల్లోనూ పలు చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకుల ఆధిపత్యం, ఇతర పార్టీల నుంచి చేరిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
రాజాంలో జనసేన, బీజేపీకి కేటాయించిన స్థానాల్లో తమ వారిని ఆయా పార్టీల్లో చేర్చి పోటీ చేయిస్తామని టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ (Kondru Murali Mohan) వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. పాలకొండ, సాలూరులో జనసేనకు సీట్లు కేటాయించడంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Gummidi Sandhya Rani) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి.
తునిలో టీడీపీ నుంచి జనసేనలో చేరిన మళ్ల గణేష్ (Malla Ganesh) భార్య మీనాక్షి (Meenakshi) చైర్పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం చర్చకు దారితీసింది. గొల్లప్రోలులోని మొత్తం 23 వార్డుల్లో పోటీ చేస్తామని టీడీపీ శ్రేణులు చెబుతున్నట్లు సమాచారం. సామర్లకోటలో జనసేనకు మున్సిపాలిటీ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.
తిరువూరులో జనసేనకు సీటు కేటాయించినప్పటికీ, ఆ పార్టీకి బలమైన స్థానిక అభ్యర్థి లేకపోవడంతో టీడీపీ నుంచి అభ్యర్థిని తీసుకురావాల్సిన పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. చిలకలూరిపేటలో ఇటీవల జనసేనలో చేరిన బైరా దిలీప్ చక్రవర్తి(Baira Dileep Chakravarthy) కుటుంబానికి అవకాశం కల్పించనున్నారనే ప్రచారం సాగుతోంది. దర్శిలో టీడీపీ స్థానిక నాయకత్వం సూచించిన అభ్యర్థికే టికెట్ దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, భీమవరం, తాడేపల్లిగూడెంలో ఎన్నికలు పెండింగ్లో ఉండగా, పిఠాపురం, ముమ్మిడివరం, అమలాపురం, నిడదవోలు, నరసాపురం, పెడన, తెనాలి వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం పెద్దగా వివాదాలు బయటకు రాలేదని పేర్కొంటున్నారు.
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, స్థానిక నాయకులకు ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీ నేతల నిర్ణయాలకే పెద్దపీట వేస్తున్నారనే భావన జనసేన శ్రేణుల్లో బలపడుతోందనే చర్చ సాగుతోంది. కూటమిలో భాగస్వామ్య పార్టీగా జనసేనకు దక్కాల్సిన రాజకీయ ప్రాధాన్యం ఏమిటి? ప్రకటించిన వాటా, వాస్తవంగా అమలవుతున్న సీట్ల పంపకం మధ్య వ్యత్యాసం ఎందుకు కనిపిస్తోంది? అనే ప్రశ్నలు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి.





