రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మరోసారి తన వ్యాఖ్యలతో తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రబిందువయ్యారు. “18కి 18 రోడ్లు వేయిస్తా… కానీ మా అభ్యర్థిని గెలిపిస్తేనే” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
“ప్రజలు మీ అభ్యర్థిని గెలిపించకపోతే రోడ్లు రావా?”, “ప్రజల పన్నుల డబ్బుతో చేసే అభివృద్ధికి ఎన్నికల షరతులు ఎందుకు?” అంటూ మక్కువ మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి అనేది ఓట్లకు ప్రతిఫలం కాదని, ప్రతి పౌరుడికి రాజ్యాంగబద్ధమైన హక్కు అని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం రోడ్లు వేయడం తన విధి మాత్రమేనని, దానిని రాజకీయ బేరసారాలుగా మార్చడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.
మంత్రి సంధ్యారాణి గతంలో చేసిన పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా మరోసారి చర్చనీయాంశమయ్యాయి. స్కూల్ లో పిల్లలకు జ్వరాలు వస్తే అది తన బాధ్యత కాదన్న వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. గిరిజన పిల్లల ఆరోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్యం, దోమల నివారణ, తాగునీటి నాణ్యత, వైద్య సేవల అందుబాటు వంటి అంశాలు ప్రభుత్వ బాధ్యత కాదా అని అప్పట్లో ప్రజా సంఘాలు ప్రశ్నించినా స్పష్టమైన సమాధానం రాలేదని విమర్శలు వచ్చాయి.
కరోనా సమయంలో మరణించిన వారిని మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించలేదంటూ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. అలాగే మోదకొండమ్మ జాతర తేదీల మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన గిరిజన మహిళతో జరిగిన వాగ్వాదం కూడా తీవ్ర విమర్శలకు కారణమైంది.
గిరిజన ప్రాంతాల్లో రేషన్ వాహనాల ద్వారా సరుకుల పంపిణీ నిలిపివేసి తిరిగి రేషన్ షాపుల వ్యవస్థ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు కూడా గిరిజనుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దూర ప్రాంతాలకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుందని, ఇంటి వద్దకే రేషన్ అందించే విధానం కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
మంత్రి కార్యాలయానికి సంబంధించిన వివాదాలు కూడా తరచూ వెలుగులోకి వచ్చాయి. మంత్రి అనధికార పీఏ, తన కుమారుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ మహిళా ఉద్యోగిని పోలీసులను ఆశ్రయించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే మంత్రి కారు డ్రైవర్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నాడంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర వ్యక్తిగత సహాయకుడు ఫిర్యాదు చేశారు.
సాలూరు నియోజకవర్గానికి చెందిన ఓ ఆశా వర్కర్ వేధింపుల కారణంగా మనోవేదనతో గుండెపోటుకు గురై మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంలో మంత్రిని కలిసి వేడుకున్నా న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి కాన్వాయ్‌కు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు కూడా వివాదాలకు కారణమయ్యాయి. రామభద్రపురం వద్ద జరిగిన ప్రమాదంలో మంత్రి చేసిన వ్యాఖ్యలను గ్రామస్థులు ఖండించగా, మరో ఘటనలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర ప్రయాణిస్తున్న వాహనాన్ని మంత్రి కాన్వాయ్ ఢీకొనడం కూడా రాజకీయ దుమారానికి దారితీసింది.
ఇదిలా ఉండగా, మంత్రి వ్యవహారశైలిపై సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తి వ్యక్తమవుతోందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్టీ నాయకులతో విభేదాలు, అధికార కార్యక్రమాల్లో చోటుచేసుకున్న పరిణామాలు, ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రి కనిపించకపోవడం వంటి అంశాలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
ఇలా వరుస వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యలు, పరిపాలనా నిర్ణయాలపై విమర్శలతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజా “గెలిపిస్తేనే రోడ్లు” వ్యాఖ్యలతో ఆమెపై విమర్శలు మరింత తీవ్రం కావడంతో, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, అభివృద్ధిపై ప్రభుత్వ వైఖరి, ప్రజాస్వామ్య విలువలపై మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది.






