రాంచీలోని (Ranchi) బిర్సా ముండా స్టేడియం (Birsa Munda Stadium) భారత అథ్లెటిక్స్ (India Athletics) చరిత్రలో అరుదైన ఘట్టానికి వేదికైంది. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Athletics Federation of India – AFI) నిర్వహించిన పురుషుల 100 మీటర్ల రేసులో పంజాబ్‌కు చెందిన 25 ఏళ్ల స్ప్రింటర్ గురిందర్‌వీర్ సింగ్ (Gurindervir Singh) కేవలం 10.09 సెకన్లలో రేసును పూర్తి చేసి కొత్త జాతీయ రికార్డు (National Record) సృష్టించాడు. భారత అథ్లెటిక్స్ చరిత్రలో తొలిసారిగా ఒక అథ్లెట్ 100 మీటర్ల పరుగును 10.10 సెకన్ల లోపు పూర్తి చేయడం ఇదే మొదటిసారి. దీంతో గురిందర్‌వీర్ సింగ్ దేశంలోనే అత్యంత వేగవంతమైన రన్నర్‌గా నిలిచాడు.
ఫినిష్ లైన్ దాటిన వెంటనే గురిందర్‌వీర్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తన ఛాతీపై ఉన్న బిబ్ నంబర్‌ను చించివేసి, బూట్లను ట్రాక్‌పైకి విసిరేస్తూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. తన రికార్డు విజయంపై స్పందిస్తూ గురిందర్‌వీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “100 మీటర్ల పరుగులో భారతీయులకు (Indians) సరైన జన్యువులు లేవని చాలా మంది అనేవారు. నేను వారందరికీ తప్పు అని నిరూపించాలనుకున్నాను. భారతీయుల జన్యువులు చాలా శక్తివంతమైనవి. ఇది కేవలం ఆరంభం మాత్రమే” అని తెలిపాడు.
ఈ సీజన్‌లో ఆసియాలో నమోదైన టైమింగ్స్‌లో గురిందర్‌వీర్ 10.09 సెకన్లు రెండో అత్యంత వేగవంతమైన సమయంగా నిలిచింది. జపాన్ స్ప్రింటర్ ఫుకుటో కొమురో నమోదు చేసిన 10.08 సెకన్ల సమయానికి కేవలం 0.01 సెకన్ల తేడాతో వెనుకబడ్డాడు. అలాగే 2026 కామన్వెల్త్ గేమ్స్‌కు అవసరమైన 10.16 సెకన్ల క్వాలిఫికేషన్ మార్క్‌ను కూడా సులభంగా అధిగమించాడు.
ఈ పోటీలో గురిందర్‌వీర్ సింగ్, ఒడిశాకు (Odisha) చెందిన అనిమేష్ కుజుర్ మధ్య హోరాహోరీ పోటీ కనిపించింది. గతంలో 10.18 సెకన్ల జాతీయ రికార్డు సృష్టించిన అనిమేష్ ఈ ఈవెంట్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అయితే సెమీఫైనల్లో గురిందర్‌వీర్ 10.17 సెకన్లతో ముందుగా జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 5 నిమిషాల తర్వాత రెండో సెమీఫైనల్ హీట్‌లో అనిమేష్ 10.15 సెకన్లతో తిరిగి రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. దీంతో ఒకే రోజులో కొన్ని నిమిషాల వ్యవధిలో జాతీయ రికార్డు రెండుసార్లు బద్దలవడం సంచలనంగా మారింది.
ఫైనల్ రేసులో మాత్రం గురిందర్‌వీర్ పూర్తి ఆధిపత్యం చాటాడు. అనిమేష్ కుజుర్ కంటే 0.11 సెకన్లు వేగంగా పరుగెత్తి కనీసం రెండు అడుగుల ముందుగానే ఫినిషింగ్ లైన్ దాటాడు. రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన ప్రణవ్ గురవ్ 10.29 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు.
తన విజయ రహస్యంపై గురిందర్‌వీర్ మాట్లాడుతూ, “మా శిక్షణ ఫలితమే ఇది. మేము బలహీనతలను సరిదిద్దుకుని, మా బలాన్ని మరింత పెంచుకున్నాం. చివరి క్షణాల్లో ఆట కేవలం శారీరకంగా కాదు, మానసికంగా కూడా ఉంటుంది. మానసికంగా బలంగా ఉన్నవారే గెలుస్తారు” అని పేర్కొన్నాడు.
ఇదే పోటీలో పురుషుల 400 మీటర్ల రేసులో విశాల్ సంచలన ప్రదర్శన చేశాడు. అతడు 44.98 సెకన్లలో రేసును పూర్తి చేసి తన సొంత జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో 45 సెకన్ల లోపు 400 మీటర్ల పరుగును పూర్తి చేసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో ఆసియాలో నమోదైన అత్యంత వేగవంతమైన సమయంగా ఇది నిలిచింది. తమిళనాడుకు చెందిన రాజేష్ రమేష్ 45.31 సెకన్లతో రెండో స్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన జై కుమార్ 45.47 సెకన్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.






