మాజీ మంత్రి, బీఆర్‌ఎస్(BRS) నేత హరీశ్‌రావు (Harish Rao) సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై (Sammakka Sagar Project) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒకసారి అన్ని రకాల అనుమతులు పొందిన ప్రాజెక్టులను (Projects) తిరిగి సమీక్షించి రద్దు చేసిన చరిత్ర ఎక్కడా లేదని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో (KCR Government) తెలంగాణకు సాధించిన కీలక ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసేలా గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) అజెండా సిద్ధం చేస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పరోక్షంగా సహకరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
2022 ఆగస్టు 25న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు సాధించిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పుడు అదే ప్రాజెక్టును నిలిపివేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కర్ణాటకలో (Karnataka) ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశంలో 47 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టును వదులుకోవాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కోరగా, తెలంగాణ ప్రభుత్వం అందుకు అంగీకరించిందని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీరు ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌కు ఉపయోగపడుతుందని, అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాము ఈ అంశాన్ని లేవనెత్తిన రెండు రోజులకే కేంద్రానికి మంత్రి లేఖ రాయడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన 7 అనుమతులను సమీక్షిస్తామని కేంద్రం చెబుతున్నా బీజేపీ(BJP) నాయకులు స్పందించకపోవడం బాధాకరమని హరీశ్‌రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భయపడి కేంద్ర మంత్రులు మౌనం పాటిస్తున్నారని ఆరోపించారు. వెంటనే స్పందించకపోతే తెలంగాణ హక్కుల కోసం మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో చంద్రబాబు అనుకూల ప్రభుత్వం ఉండటంతోనే జీఆర్ఎంబీ అజెండాలో ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే కేంద్రం లేదా ఆంధ్రప్రదేశ్ ఇలాంటి చర్యలకు సాహసించేవి కావని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న అధికారులు తెలంగాణ ఇరిగేషన్ శాఖలో (Telangana Irrigation Department) కీలక బాధ్యతలు నిర్వహించడం కూడా ఈ పరిస్థితికి కారణమని హరీశ్‌రావు ఆరోపించారు. జీఆర్ఎంబీ సమావేశ అజెండా నుంచి గోదావరి, బనకచర్ల అంశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో బలంగా ప్రస్తావించాలని కోరారు. రిట్, సూట్ పిటిషన్ల పేరుతో ప్రభుత్వం ఏడాది కాలంగా విలువైన సమయాన్ని వృథా చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి లోపాయికారీ ఒప్పందాలతో గోదావరి, బనకచర్ల ప్రాజెక్టులకు అంగీకరించారని ఆరోపించారు. గోదావరి జలాల్లో తెలంగాణకు చట్టబద్ధంగా 960 టీఎంసీల నీటి హక్కులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటుంటే ముఖ్యమంత్రి మౌనంగా ఉండటం దురదృష్టకరమని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.






