మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓట్ల తొలగింపు (Votes Deletion) కుట్రలను కార్యకర్తలు అప్రమత్తంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చిన ఆయన, సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను (Assigned Lands) స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్(BRS) కార్యకర్తల ఆత్మీయ సమావేశం, సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) చేస్తున్న వ్యాఖ్యలను ఎద్దేవా చేసిన హరీశ్ రావు, ప్రభుత్వం తమపై విమర్శలు చేయాలనుకుని చివరకు సెల్ఫ్ గోల్ (Self Goal) చేసుకుందని అన్నారు. ఒకరోజు తెలంగాణ భవన్ (Telangana Bhavan), మరోరోజు అమరవీరుల స్థూపం(Martyrs’ Memorial), ఇప్పుడు ప్రెస్ క్లబ్ వేదికగా చర్చలకు పిలవడం రాజకీయ నాటకమని విమర్శించారు. మొదట తనను, కేటీఆర్‌ను(KTR) పిలిచి, ఇప్పుడు కేసీఆర్‌ను(KCR) కూడా చర్చకు రావాలని కోరడం విచిత్రమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు ఎఫ్ఆర్బీఎం (FRBM) కింద రూ.1,86,087 కోట్ల అప్పు తీసుకుందని అధికారిక లెక్కలు చెబుతుండగా, మంత్రి జూపల్లి మాత్రం రూ.1,77,058 కోట్లుగా పేర్కొన్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ రెండు లెక్కల మధ్య ఉన్న దాదాపు రూ.10,000 కోట్ల వ్యత్యాసంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మార్చి 18, 2026న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) 27 నెలల్లో రూ.3,47,294 కోట్ల అప్పు చేశామని ప్రకటించారని గుర్తుచేసిన హరీశ్ రావు, ముఖ్యమంత్రి చెప్పిన లెక్కలు నిజమా లేక మంత్రి చెప్పినవే నిజమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులు రూ.4 లక్షల కోట్ల పరిధిలోనే ఉన్నాయని తాము అసెంబ్లీలోనే నిరూపించామని, కాగ్ నివేదిక (CAG Report) కూడా అదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. కాంగ్రెస్ నేతలు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అభివృద్ధిని (Development) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రత్యేక అభివృద్ధి నిధులతో జిల్లాకు భారీగా నిధులు తీసుకొచ్చామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మంజూరైన నిధులను కూడా వెనక్కి తీసుకుందని ఆరోపించారు.
సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టు (Sangameshwara-Basaveshwara Project) ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు నిలిచిపోవడంతో భవిష్యత్తులో 7 మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలు, పాదయాత్రలు (Padayatras) చేపడతామని స్పష్టం చేశారు.
రైతుల సమస్యల పరిష్కారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు తలెత్తితే వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేవాళ్లమని, ఇప్పుడు బీఆర్ఎస్ ఉద్యమాలు చేస్తే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రైతులకు(Farmers) చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సింగూరు ప్రాజెక్టు (Singur Project) మరమ్మతులు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్‌కు తాగునీరు అందించే కీలక ప్రాజెక్టు కావడంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలో 700 ఎకరాలు, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల అసైన్డ్ భూములపై కుట్ర జరుగుతోందని, మార్కెట్ విలువ కోట్లలో ఉన్న భూములకు గిరిజనులకు తక్కువ పరిహారం ఇచ్చి మోసం చేస్తున్నారని విమర్శించారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, వృద్ధులకు రూ.4,000 పెన్షన్, ఫీజు రీయింబర్స్‌మెంట్, పీఆర్సీ అమలు వంటి ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని హరీశ్ రావు ఆరోపించారు. హైదరాబాద్‌కు తాగునీటి భద్రత, మూసీకి నీటి సరఫరా సాధ్యమవుతున్నదంటే అది కేసీఆర్(KCR) దూరదృష్టితో నిర్మించిన మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టుల వల్లేనని పేర్కొన్నారు.







