రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ రావు(T. Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏ గ్రామానికి వెళ్లినా రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(A. Revanth Reddy) మాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణాలపల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలకే పరిమితమయ్యారని, రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు వడ్ల కొనుగోళ్లపై ఒక్కసారి కూడా కలెక్టర్ల సమావేశం నిర్వహించలేదని, మంత్రులతో సమీక్ష చేయలేదని ప్రశ్నించారు.
ఏసీ గదుల్లో కూర్చుని అబద్ధాలు చెబుతున్నారు
ప్రభుత్వానికి రైతులపై కనీస చిత్తశుద్ధి లేదని హరీశ్ రావు ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏసీ గదుల్లో కూర్చుని అబద్ధాలు చెబుతున్నారని, ఒకసారి పోలీసులను పక్కన పెట్టి కొనుగోలు కేంద్రాలు తిరిగితే రైతుల అసలు బాధ తెలుస్తుందని అన్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, సర్పంచులే కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్న ప్రభుత్వం రైతుల సమస్యలపై మాత్రం స్పందించడం లేదని విమర్శించారు. ఇంటెలిజెన్స్, పోలీసులు రైతుల పరిస్థితిపై నివేదికలు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే లారీలు పంపించి, కాంటాలు ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల తరఫున బీఆర్ఎస్ నాయకులు కలెక్టరేట్ల ముట్టడికి దిగుతామని హెచ్చరించారు.
సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌లో అవినీతి ఆరోపణలు
మక్కలు, శనగలు, సన్‌ఫ్లవర్ పంటలు అమ్మిన రైతులకు ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదని హరీశ్ రావు ఆరోపించారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు. 35 రోజులుగా సన్‌ఫ్లవర్ కొనుగోళ్లు ఆగిపోయాయని, పంటలు కుప్పల కింద పాడవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి కారణంగానే ఆ సంస్థ ఆర్థికంగా దెబ్బతిందని ఆరోపించారు. బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడంతో కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా సివిల్ సప్లైస్‌కు నిధులు మళ్లిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అవినీతి, తప్పిదాల భారాన్ని రైతులపై మోపుతున్నారని మండిపడ్డారు.






