బీఆర్ఎస్(BRS) నిలదీస్తే కానీ సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) సోయి రాదా? తెలంగాణ ప్రాజెక్టులను (Telangana Projects)అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం (AP Government) కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB) సమావేశం ఎజెండాలో పెట్టినప్పుడు ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినా తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని నిలదీశారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఎందుకు ప్రశ్నించలేదని, ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని హరీష్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్(BRS) ప్రశ్నించిన తర్వాత హడావుడిగా లేఖలు రాయడం తప్ప తెలంగాణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉందా అని విమర్శించారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు రాస్తున్న నామమాత్రపు లేఖలు తెలంగాణ ప్రాజెక్టులను కాపాడతాయా అని ప్రశ్నించారు.
లేఖలు(Letters) రాస్తే సమస్యలు పరిష్కారం కావని, తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం ప్రభుత్వం రాజీలేని పోరాటం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఎజెండాలో పెట్టిన అంశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఆ అంశాలను ఎజెండా నుంచి తొలగించే వరకు తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టాలని కోరారు.
అవసరమైతే ఆ అంశాలను వెనక్కి తీసుకోకపోతే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కాబోమని ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని హరీష్ రావు అన్నారు. అలా కాకుండా రాజకీయ అవసరాల కోసం సమావేశానికి వెళ్లి తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యంతరాలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయమని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కులకు సంబంధించిన అంశమని అన్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేసే సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఈ నెల 18న హైదరాబాద్లో(Hyderabad) జరగనున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని ప్రస్తుత ఎజెండాతోనే నిర్వహిస్తే తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ వేలాది మందితో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హరీష్ రావు హెచ్చరించారు. కేంద్రం పరిధిలో ఉన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, చంద్రబాబు(Chandrababu), రేవంత్ (Revanth Reddy)కలిసి తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.






కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ మద్దతు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..!